యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చినప్పటికీ తెలుగులో వరుస సినిమాలు చేస్తూ తనదైన మార్క్ క్రియేట్ చేసుకుంది ఈ భామ. ఎనర్జిటిక్ డాన్స్‌లు, నటన, క్యూట్ లుక్స్‌తో తక్కువ కాలంలోనే యువ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించింది. అయితే స్టార్‌డమ్ వచ్చినంత వేగంగా, ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ విజయాలు మాత్రం ఇటీవల కాలంలో ఆమెను పలకరించలేదు.
శ్రీలీల తొలిసారి కోలీవుడ్‌లో హీరోయిన్ గా నటించిన చిత్రం ‘పరాశక్తి’. మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలతో పేరు తెచ్చుకున్న దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో, శివకార్తికేయన్ హీరోగా రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కానీ తమిళ్‌లో విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయి ఫలితాన్ని అందుకోలేకపోయింది. దీంతో కోలీవుడ్ అరంగేట్రం శ్రీలీలకు నిరాశనే మిగిల్చింది.
గత ఏడాది కాలంలో శ్రీలీల చేతిలో సినిమాల సంఖ్య ఎక్కువగానే ఉన్నా, పూర్తి స్థాయి సక్సెస్ మాత్రం దక్కలేదు. మంచి అవకాశాలు వచ్చినా, ఫలితాలు అనుకూలంగా లేకపోవడంతో ఆమె కెరీర్‌పై చర్చ మొదలైంది. అయినప్పటికీ ఆమెపై నిర్మాతల నమ్మకం తగ్గలేదు అనడంలో సందేహం లేదు.
ఇక భవిష్యత్ ప్రాజెక్టుల విషయానికి వస్తే, బాలీవుడ్‌పైనే శ్రీలీల ఆశలు పెట్టుకుంది. కార్తీక్ ఆర్యన్ హీరోగా వస్తున్న ఓ మ్యూజికల్ లవ్ స్టోరీలో ఆమె కీలక పాత్రలో కనిపించనుంది. ఆ సినిమా ‘ఆషీకీ 3’ అంటూ గుసగుసలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే సిద్దార్థ్ మల్హోత్రా తో కలిసి మరో హిందీ సినిమా కూడా చేస్తోంది. తెలుగులో మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లో నటిస్తోంది. ఈ సినిమాతో మళ్లీ స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇవ్వాలని శ్రీలీల అభిమానులు ఆశిస్తున్నారు. మరి రాబోయే రోజులు ఆమెకు ఎలాంటి టర్నింగ్ పాయింట్ ఇస్తాయో చూడాలి.