ఎన్టీఆర్ జయంతి సందర్భంగా శ్రీరామ దండకం ఆలపించిన నందమూరి బాలకృష్ణ!

  • May 28, 2021 / 01:57 PM IST

శ్రీరాముడు అంటే తెలుగు ప్రజలకు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి రామారావు గుర్తుకు వస్తారు. శ్రీకృష్ణుడు అన్నా ఆయనే గుర్తుకు వస్తారు. ఆయనది అంతటి దివ్య సమ్మోహన రూపం. ‘లవకుశ’ తెలుగు-తమిళ వెర్షన్లు, ‘సంపూర్ణ రామాయణం’ తమిళ వెర్షన్, ‘శ్రీకృష్ణ సత్య’, ‘శ్రీ రామాంజనేయ యుద్ధం’, ‘శ్రీరామ పట్టాభిషేకం’… ఆరు చిత్రాల్లో శ్రీరామ చంద్రుని పాత్రకు ఎన్టీఆర్ ప్రాణప్రతిష్ఠ చేశారు. తెలుగు ప్రజలను అలరించారు. ఇంకా, ‘అడవి రాముడు’, ‘చరణదాసి’, ‘చిట్టి చెల్లెలు’, ‘తిక్క శంకరయ్య’ మొదలగు పది చిత్రాల్లో అంతర్ నాటకాల్లో రాముడిగా కనిపించారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజల మనసుల్లో శ్రీరాముడిగా ముద్రించుకుపోయిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్.

నేడు (మే 28) ఎన్టీఆర్ జయంతి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కుమారుడు, తండ్రికి తగ్గ తనయుడిగా ప్రజల మన్ననలు అందుకుంటున్న నందమూరి బాలకృష్ణ శ్రీరామ దండకం ఆలపించారు. క్లిష్టమైన, గ్రాంధిక పదాలు, వత్తులతో పలకడానికి కష్టమైన దండకాన్ని బాలకృష్ణ అవలీలగా ఆలపించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా శుక్రవారం ఉదయం 9.45 గంటలకు ఈ శ్రీ రామ దండకాన్ని విడుదల చేశారు. ఈ శ్రీరామ దండకం నిడివి: 3.15 నిమిషాలు. వినోద్ యాజమాన్య సంగీతం సమకూర్చారు.

నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ “ధర్మం లోపించిన సమయమిది. ధర్మానికి ప్రతిరూపం శ్రీరామ చంద్రుడు. శ్రీరామ చంద్రుని పాత్రకు వెండితెరపై నాన్నగారు ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఈ సమయంలో ఆ శ్రీరాముని మనం తలుచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే… నాన్నగారి జయంతి సందర్భంగా అందరికీ మంచి జరగాలని, స్వస్థత చేకూరాలని, కరోనా నుంచి ప్రపంచానికి విముక్తి కలగాలని శ్రీరామ దండకాన్ని ఆలపించాను” అని అన్నారు.

ఎన్.బి.కె. ఫిల్మ్స్ యూట్యూబ్ ఛానల్‌ ద్వారా శ్రీరామ దండకం విడుదల చేశారు. దీనికి బాలకృష్ణ ముందుమాట చెప్పారు. శ్రీరామునిగా నందమూరి తారక రామారావు స్టిల్స్ ఒక్కొక్కటీ తెరపై వస్తుంటే… నేపథ్యంలో బాలకృష్ణ ఆలపించిన దండకం వినిపించింది. దీనికి తెలుగు ప్రజల నుంచి అద్భుత స్పందన లభిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో పలువురు ప్రేక్షకులు ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు.


ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus