ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!

  • May 27, 2021 / 11:46 AM IST

సంతోష్ శోభన్ కథానాయకుడిగా తెరకెక్కిన తాజా చిత్రం “ఏక్ మినీ కథ”. దర్శకుడు మేర్లపాక గాంధీ కథ అందించిన ఈ చిత్రం థియేటర్లలో విడుదలకు సిద్ధమైనా.. సెకండ్ వేవ్ దెబ్బకి ఒటీటీలోనే విడుదలైంది. కావ్య థాపర్ కథానాయికగా నటించిన ఈ చిత్రం అమేజాన్ ప్రైమ్ లో విడుదలైంది. 5 కోట్ల లోపు బడ్జెట్ లో విడుదలైన ఈ చిత్రం డిజిటల్ రైట్స్ 9 కోట్లకు అమ్ముడుపోవడమే పెద్ద విజయం కింద కన్సిడర్ చేయొచ్చు. అయితే.. సినిమా ఎలా ఉంది? అనేది చూద్దాం..!!

కథ: సంతోష్ (సంతోష్ శోభన్) ఓ సాధారణ యువకుడు. చిన్న ఉద్యోగం చేసుకుంటూ పైకి సంతోషంగా ఉంటూనే లోలోపల మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటాడు. అందుకు కారణం అతడు ఎవరికీ చెప్పుకోలేని బాధ. చెప్పుకుందామంటే సిగ్గు, అలాగని తనలో తానే కుమిలిపోలేడు. ఒక రెగ్యులర్ వ్యక్తితో పోల్చుకుంటే తన అంగం చిన్నది అని భావించడమే.

నిజంగానే అతడిది మరీ అంత చిన్నదా? ఆ సైజ్ పెంచుకోవడానికి అతడు పడిన తిప్పలేమిటి? ఆ కారణంగా అతడు ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? అనేది “ఏక్ మినీ కథ” కథాంశం.

నటీనటుల పనితీరు: సంతోష్ ప్రతి సినిమాతో నటుడిగా మెచ్యూర్ అవుతున్నాడు. హావభావాల ప్రకటన, డైలాగ్ డెలివరీలో సంతోష్ చాలా పరిణితి ప్రదర్శించాడు. అయితే.. కొన్ని మ్యానరిజమ్స్ మాత్రం నటుడు నానిని తలపిస్తున్నాయి. ఆ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకుంటే మంచిది. కావ్య థాపర్ ఈ సినిమాకి గ్లామర్ ని యాడ్ చేసింది కానీ నటిగా మాత్రం సినిమాకి ప్లస్ అవ్వలేకపోయింది. ఆమె డబ్బింగ్ బాగోలేదు, ముఖ్యంగా నేటివిటీకి ఆమె స్కిన్ టోన్ సింక్ అవ్వలేదు. అందువల్ల ఆమె పాత్రకు పెద్దగా కనెక్టివిటీ క్రియేట్ అవ్వలేదు.

బ్రహ్మాజీ, సుదర్శన్, సప్తగిరిలకు చాన్నాళ్ల తర్వాత లెంగ్తీ రోల్స్ దొరకాయి. సదరు పాత్రల్లో వారు హిలేరియస్ గా నవ్వించారు. హర్షవర్ధన్ క్యారెక్టర్ బాగుంది, నవ్వించడమే కాక చిన్నపాటి మెసేజ్ ను కూడా ఇచ్చాడు.

సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ తరహా సమస్యను కథగా రాసినందుకు అభినందనీయుడు. నిజానికి “నాది చిన్నగా ఉంది” అని బాధపడే యూత్ ఎక్కువైపోయారు. అలాంటి యువత పడే బాధలు, చెకింగ్ పేరుతో చేసే చేష్టలను హిలేరియస్ గా రాసుకున్నాడు. అయితే.. హీరో క్యారెక్టర్ మాత్రమే బోల్డ్ గా, మిగతా పాత్రలు ట్రెడిషనల్ గా ప్రెజంట్ చేయడం అనేది సింక్ అవ్వలేదు. ఈ తరహా కథలు ఇంకాస్త బోల్డ్ గా చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ చూడరేమో అనే భయం వల్లనో, లేక ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా సినిమా రీచ్ అవ్వాలన్న తాపత్రయమో సినిమాలోని బోల్డ్ ఎలిమెంట్స్ ను నార్మలైజ్ చేసేశారు. “విక్కీ డోనర్” లాంటి సినిమా పదేళ్ళ క్రితమే సూపర్ హిట్ అవ్వడానికి కారణం స్పెర్మ్ డొనేషన్ గురించి ఎలాంటి ఫిల్టర్స్ & సెన్సార్ లేకుండా చెప్పగలగడమే.

“ఏక్ మినీ కథ”లో అది మిస్ అయ్యింది. రీజనల్ ఆడియన్స్ వరకూ పర్లేదు కానీ, ఈ తరహా సినిమాలను ఎక్కువగా ఎంకరేజ్ చేసే అర్బన్ & మల్టీప్లెక్స్ ఆడియన్స్ ను ఈ చిత్రం విశేషమైన రీతిలో ఎంటర్ టైన్ చేయలేకపోవచ్చు. నిజానికి ఇదేమీ కొత్త కాన్సెప్ట్ కాదు.. స్నేహ భర్త ప్రసన్న కథానాయకుడిగా నటించి దర్శకత్వం కూడా వహించిన “కళ్యాణ సమయల్ సాధమ్” కూడా ఇదే తరహా కథతో తెరకెక్కింది. అయితే.. అది అంగ స్కలనం గురించి. ఆ సినిమాను ఇంకాస్త బోల్డ్ గా తెరకెక్కించాడు దర్శకుడు. అందువల్ల సినిమా ఎక్కడా ట్రాక్ తప్పలేదు.

రచయిత మేర్లపాక గాంధీ, దర్శకుడు కార్తీక్ రాపోలు ఈ సినిమా విషయంలో చేసిన ఇంకో పొరపాటు, కామెడీ కోసం చిత్రవిచిత్రమైన పాత్రలను సినిమాలో ఇరికించడమే. పూజా హెగ్డే కాళ్ళ మీద కోరిక పెంచుకున్న తాత, ఫ్యామిలీ ఫంక్షన్ లోనూ నైటీ వేసుకొని టిక్ టాక్ లు చేసే మరదలు, సచ్చిపోవడానికి విశ్వప్రయత్నం చేసే తమ్ముడు, ఇలా కథకు ప్లస్ అవ్వలేని చాలా క్యారెక్టర్స్ ను క్రియేట్ చేసి ఇరికించారు. రాజేష్ ఖన్నా పాత్రైనా కాస్త నయం కానీ, తాత-మరదలు పాత్రలు మాత్రం వెగటుగా ఉన్నాయి. హాస్య గ్రంధులు ఏమైనా మూసుకుపోయాయా అని ఆలోచన కూడా వస్తుంది వాళ్ళ సీన్లు చూస్తుంటే. సో, రైటర్ గా మేర్లపాక గాంధీ బొటాబోటి మార్కులతో సరిపెట్టుకోగా, కార్తీక్ పాస్ అవ్వడానికి రెండు మార్కుల దూరంలో ఆగిపోయాడు.

ప్రవీణ్ లక్కరాజు సంగీతం సినిమాకి చెప్పుకోదగ్గ ప్లస్ పాయింట్స్ లో ఒకటి. డిఫరెంట్ వాయిస్ లు, కొత్త తరహా ట్యూన్స్ తో ఆకట్టుకున్నాడు. నేపధ్య సంగీతం వినడానికి ఫ్రెష్ గా ఉంది.

సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్ ప్రొడక్షన్ హౌజ్ స్టాండర్డ్స్ కి ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్నాయి.

విశ్లేషణ: కాన్సెప్ట్ బోల్డ్ కదా, సినిమా కూడా బోల్డ్ గా ఉంటుందేమో అనుకుంటే కాస్త నిరాశచెందుతారు కానీ, ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే మాత్రం ఓ మోస్తరుగా ఆకట్టుకునే సినిమా “ఏక్ మినీ కథ”. నటుడిగా సంతోష్, సంగీత దర్శకుడిగా ప్రవీణ్ లక్కరాజు తమ బెస్ట్ ఇచ్చిన సినిమా ఇది. ఒటీటీ ఆడియన్స్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు.

రేటింగ్: 2.5/5

Click Here To Read in ENGLISH

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus