దివంగత నటి శ్రీదేవి చెన్నై ఆస్తి వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. అంతేకాదు ఈసారి విషయం తేలేలా ఉంది. చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్డులో ఉన్న ఆ స్థలంపై సుప్రీంకోర్టుకులో దాఖలైన పిటిషన్ విచారణకు వచ్చింది. అయితే తదుపరి విచారణ జరిగేంతవ వరకు ఆ స్థలం విషయంలో స్టేటస్ కో (ఉన్నది ఉన్నట్లు) కొనసాగించాలని న్యాయస్థానం ఆదేశించింది. అలాగే ఆస్తి వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇరువర్గాలకు న్యాయస్థానం ఈ సందర్భంగా సూచించింది.
1988లో చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్డులో శ్రీదేవి 4.77 ఎకరాల స్థలాన్ని ముదలియార్ అనే వ్యక్తి కుటుంబం నుండి కొనుగోలు చేశారు. అయితే శ్రీదేవి మరణానంతరం 2023లో ఆ ఆస్తి మార్పిడి కోసం శ్రీదేవి కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ సమయంలో ముదలియార్ రెండో భార్య పిల్లలు ఎం.సి.శివగామి, ఆమె సోదరుడు ఈ ఆస్తిలో తమకూ వాటా ఉందంటూ చెంగల్పట్టు కోర్టులో కేసు వేశారు.
దీంతో ఆ కేసును కొట్టివేయాలని శ్రీదేవి భర్త బోనీ కపూర్, కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. మొదటి భార్య ప్రాణాలతో ఉండగానే ముదలియార్ రెండో పెళ్లి చేసుకున్నారని, కాబట్టి రెండో భార్య పిల్లలకు చట్టపరంగా వారసత్వ హక్కులు ఉండవని శ్రీదేవి కుటుంబం తరఫు న్యాయవాదాలు వాదించారు. వారి వాదనలతో ఏకీభవించిన మద్రాస్ హైకోర్టు ఆ కేసును కొట్టివేసింది.
అయితే మద్రాస్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ శివగామి కుటుంబం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కేసు ప్రాథమిక దశలో ఉండగానే హైకోర్టు మినీ-ట్రయల్ జరిపింది అనేది పిటిషనర్ వాదన. 1988లో జరిగిన కొనుగోలుపై ఇన్నేళ్ల తర్వాత (2025లో) కేసు వేయడం సరికాదని కపూర్ కుటుంబం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. ఇందుకోసం ఓ విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తిని నియమిస్తామని చెప్పింది. ఆ తర్వాత తదుపరి విచారణను డిసెంబర్ 18కి వాయిదా వేసింది.