పూటకో హీరోయిన్ పుట్టుకొస్తున్న తరుణంలోనూ “మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు?” అని 90ల కాలంలో పుట్టినవారిని ఎవరి అడిగినా మరో ఆలోచన లేకుండా చెప్పే సమాధానం “శ్రీదేవి”. రాఘవేంద్రరావు “పదహారేళ్ళ వయసు” సినిమాలో “సిరిమాల్లే పువ్వా..” అంటూ పడుచు ప్రాయంలో తెలుగు తెరకు పరిచయమైన శ్రీదేవి.. తదనంతరం తెలుగు-తమిళ-మలయాళ-హిందీ చిత్రసీమలను ఏలింది. శ్రీదేవి డేట్స్ కోసం స్టార్ హీరోలు సైతం వేచి చూసేలా తన మార్కెట్ ను, క్రేజ్ ను పెంచుకొంది. అందుకే శ్రీదేవి మొట్టమొదటి “లేడీ సూపర్ స్టార్” అయ్యింది.
బోణీకపూర్ తో వివాహం అనంతరం సినిమాలకు స్వస్తి పలికిన శ్రీదేవి “ఇంగ్లీష్ వింగ్లీష్”తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టింది. “మామ్” ఆమె నటించిన ఆఖరి చిత్రం. సరిగ్గా రెండు వారాల క్రితం ల్యాక్మీ ఫ్యాషన్ వీక్ లో తన జాహ్నవి కపూర్ తో కలిసి ర్యాంప్ వాక్ చేస్తే.. చూసినోళ్ళందరూ “తల్లీకూతుళ్లలా లేరు.. అక్కాచెల్లెళ్లలా ఉన్నారు” అంటూ శ్రేదేవికి బోలెడంత దిష్టి పెట్టేశారు. ఆ దిష్టి వలనే ఏమో నిన్న అర్ధరాత్రి (ఫిబ్రవరి 24) శ్రీదేవి గుండెపోటుతో మరణించారు. ఒక ఫ్యామిలీ వెడ్డింగ్ అటెండ్ అవ్వడం కోసం దుబాయ్ వెళ్ళిన శ్రీదేవి అక్కడే తన తుదిశ్వాస విడిచారు. చిత్ర పరిశ్రమను మాత్రమే కాదు యావత్ ప్రపంచాన్నే “శ్రీదేవి మరణం” కలచివేసింది. 54 ఏళ్లకే శ్రీదేవి మరణించడం అది కూడా గుండెపోటుతో అనే విషయాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఆమె వీరాభిమానులైతే దుఖ: సాగరంలో మునిగిపోయారు. “ఫిల్మీఫోకస్” ఆమె మరణానికి చింతిస్తూ.. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తోంది.