ఒక బంతిని నేలకి ఎంత గట్టిగా కొడితే.. అంతే వేగంతో పైకి ఎగురుతుంది. అందుకు మంచి ఉదాహరణ శ్రీనువైట్ల. ఒకటి కాదు రెండు కాదు మూడు వరుస డిజాస్టర్ల తర్వాత కూడా ఒక బిజీ స్టార్ హీరోతో కథను ఒకే చేయించుకోవడమే కాక ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ తన చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చేలా చేసుకొన్నాడు. ఆ ప్రొజెక్టే “అమర్ అక్బర్ ఆంటోనీ”. తన చిరకాల మిత్రుడు రవితేజ కథానాయకుడిగా.. ఆరేళ్ళ విరామం అనంతరం ఇలియానా తెలుగు తెరపై కనిపించిన సినిమా ఇది. పలుమార్లు వాయిదాపడి నవంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం గురించి, తన మునుపటి పరాజయాల గురించి, భవిష్యత్ ప్రణాళికల గురించి శ్రీనువైట్ల చెప్పిన విశేషాలు..!!
నేను చేసిన తప్పుల నుంచే ఎక్కువ నేర్చుకున్నాను..
నా మునుపటి మూడు చిత్రాలైన “ఆగడు, బ్రూస్ లీ, మిస్టర్” సినిమాల రిజల్ట్స్ నుంచి చాలా నేర్చుకొన్నాను. నేను ఒక పంథాలో ఇరుక్కుపోయాను, నేను ఒక ఫార్మాట్ ను నమ్ముకొని తెరకెక్కించిన “ఢీ, రెడీ” సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో ఇంక అందులో ఇరుక్కుపోయాను. అందులోనుంచి బయటకి రావడానికి చాలా టైమ్ పట్టింది. అలా బయటకి వచ్చి రాసుకొన్న కథ “అమర్ అక్బర్ ఆంటోనీ”.
నాకు స్టోరీ సిట్టింగ్స్ ఉదయాన్ని స్టార్ట్ అవ్వాలి..
నేను స్వతహా చాలా సింపుల్ మనిషిని. రాత్రి 10 లోపు పడుకుండిపోతాను. ఉదయం 5 గంటలకే లేస్తాను. 6 గంటలకు నా మైండ్ చాలా ఫ్రెష్ గా ఉంటుంది. స్టోరీ సిట్టింగ్స్ ఆ టైమ్ లో పెడితే బెటర్ అనిపిస్తుంది. కానీ.. నేను ఇదివరకు వర్క్ చేసిన రైటర్స్ తో ఆ సౌలభ్యం ఉండేది కాదు. అందుకే ఈసారి కొత్త టీం తో ట్రై చేశాను. వాళ్ళు ఉదయాన్నే ఇంటికి వచ్చేసేవారు. హ్యాపీగా జరిగింది స్టోరీ సెట్టింగ్ అంతా కూడా.
నేను మైత్రీ మూవీ మేకర్స్ ను సెలక్ట్ చేసుకొన్నాను..
నేను స్క్రిప్ట్ రెడీ చేసుకొని రవితేజతో సినిమా చేద్దామని ఫిక్స్ అయ్యేసరికి నాకు అయిదుగురు ప్రొడ్యూసర్స్ తో ఆప్షన్ ఉంది. కానీ.. నేను మైత్రీ మూవీ మేకర్స్ ను సెలక్ట్ చేసుకోవడానికి ముఖ్యకారణం ఆ నిర్మాతలు నాకు ముందు నుంచీ స్నేహితులు కావడంతో మైత్రీ బ్యానర్ లోనే సినిమా తీశాను. నా కెరీర్ మొత్తంలో ఇప్పటివరకూ చాలా లావిష్ గా తీసిన ఏకైక చిత్రం “అమర్ అక్బర్ ఆంటోనీ”. అది కేవలం మైత్రీ మూవీ మేకర్స్ వల్లే సాధ్యమైంది. అమెరికాలో రెండు దిఫరెంట్ సీజన్స్ లో రెండు షెడ్యూల్స్ లో సినిమా తీయడం అంటే మామూలు విషయం కాదు.
పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ డిలే వల్లే అనుకున్న తేదీకి రాకపోయాం..
నిజానికి “అమర్ అక్బర్ ఆంటోనీ” చిత్రాన్ని అక్టోబర్ 5కి రిలీజ్ చేద్దామనుకున్నాం. కానీ.. అప్పటికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అవ్వలేదు. పైగా సీజీ వర్క్ కూడా చాలా పెండింగ్ లో ఉంది. అందుకే సినిమాను నవంబర్ కి పోస్ట్ పోన్ చేశాం. విడుదల తేదీ ప్రకటన విషయంలో కాస్త తడబడ్డాము కానీ.. ఓవరాల్ గా అవుట్ పుట్ చూసి సంతోషపడ్డాం. తప్పకుండా సక్సెస్ అవుతుందన్న కాన్ఫిడెన్స్ నాకు పూర్తిగా ఉంది.
బాద్ షా టైమ్ లోనే ఇలియానాతో చేయాలి అనుకున్నా..
నిజానికి “బాద్ షా” సినిమాలో ఇలియానాను కథానాయికగా అనుకున్నాం కానీ.. ఎన్టీఆర్-ఇలియానా కాంబినేషన్ రిపీటెడ్ గా రిపీట్ అవుతుందనిపించింది. అందుకే అప్పటికి కాజల్ ను తీసుకొన్నామ్. “అమర్ అక్బర్ ఆంటోనీ” టైమ్ లో ఇలియానాను కథానాయికగా అనుకున్నాను. అయితే.. మైత్రీ వారు ఆల్రెడీ ఒకసారి ఆమెను కన్సల్ట్ చేయడం, ఆమె కాదు అనడంతో ఈ సినిమా కూడా చేయదేమో అనుకున్నారు. కానీ.. నేను ఆమెను కథ చెప్పి ఒప్పించడంతో ఆమె టీం లోకి జాయిన్ అయ్యింది. ఆమెతోనే డబ్బింగ్ కూడా చెప్పించాను. ఆమె క్యారెక్టర్ సినిమాకి పర్ఫెక్ట్ గా ఉంటుంది.
నాకు చిన్న-పెద్ద దర్శకుడు అన్న తేడా లేదు..
నా మొదటి సినిమా బడ్జెట్ 30 లక్షలు. ఇప్పుడు 30 కోట్ల బడ్జెట్ సినిమాలు తీస్తున్నాను. ఇక్కడ సినిమా బడ్జెట్ పెరిగిందే తప్ప నా స్థాయి పెరిగిందని మాత్రం నేనెప్పుడు అనుకోలేదు. నా వరకూ నేను ఎప్పుడూ ఒక దర్శకుడిని మాత్రమే, నాకు సంతృప్తినిచ్చిన కథతో సినిమా తీయడమే నా ఫైనల్ గోల్ తప్ప. అది చిన్న సినిమానా లేక పెద్ద సినిమానా అనేది నేను ఆలోచించను కూడా.
ఫెయిల్యూర్స్ నాపై ఎప్పుడూ ప్రభావం చూపలేదు..
నేను విజయం వచ్చినప్పుడు ఆనందంతో ఎగరలేదు, పరాజయం వచ్చినప్పుడు బాధతో క్రుంగిపోలేదు. నేను ఏ విషయాన్నీ సీరియస్ గా తీసుకొను. అందువల్ల సూపర్ హిట్స్ వచ్చినప్పుడు నేను పొంగిపోలేదు,, అలాగే డిజాస్టర్స్ వచ్చాయి అని బాధపడుతూ కూర్చోలేదు. ఒక దర్శకుడిగా, రైటర్ గా డిఫరెంట్ కథలు, జోనర్ లు ప్రేక్షకులకు పరిచయం చేయాలని అనేదే నా ఆలోచన.
నేను ఎలాంటి సినిమానైనా తీయగలను..
“అమర్ అక్బర్ ఆంటోనీ” అనేది చాలా కొత్త తాహా సినిమా. అలాగే.. నేను ఇప్పటివరకూ చాలా డిఫరెంట్ జోనర్స్ లో సినిమాలు చేశాను. మళ్ళీ “నీకోసం” లాంటి సినిమా తీయగలనా అంటే హ్యాపీగా తీస్తాను. ఒక దర్శకుడిగా నేను ఎలాంటి సినిమా అయినా తీయగలను అని కాన్ఫిడెంట్ గా చెప్పగలను. నేను అనుకున్న ప్రకారం “అమర్ అక్బర్ ఆంటోనీ” గనుక క్లిక్ అయితే ఈ తరహాలో ఇంకా మంచి సినిమా జోనర్స్ లో కథలు సిద్ధం చేయగలను అన్న నమ్మకం వస్తుంది.
ఆగడు ఫ్లాప్ తర్వాత కూడా మహేష్ తో రిలేషన్ మారలేదు..
నేను-మహేష్ ఎప్పుడు మంచి స్నేహితులమే. దూకుడు సూపర్ హిట్ తర్వాత మహేష్ తో రిలేషన్ ఎలా ఉందో “ఆగడు” డిజాస్టర్ తర్వాత కూడా అలాగే ఉంది. సో, మహేష్ తో మళ్ళీ ఇంకో సినిమా చేయాలన్నా కూడా తను కథ నచ్చితే తప్పకుండా డేట్స్ ఇస్తాడు.
రవితేజ నన్ను చాలాసార్లు ఆడుకున్నాడు..
నా మొదటి సినిమా “నీ కోసం” రవితేజతో తీసిన తర్వాత ఒక చిన్న లో ఫేజ్ లో ఉన్న సమయంలో రవితేజ స్వయంగా పిలిచి మరీ “వెంకీ” సినిమా చేయమని చెప్పాడు. ఆ తర్వాత నా “ఢీ” సినిమా విడుదల కష్టాల్లో ఉన్నప్పుడు మళ్ళీ రవితేజ పిలిచి “దుబాయ్ శీను” సినిమా చేద్దాం అన్నాడు. అప్పటికి కథ కూడా రెడీగా లేదు. కానీ.. నెలలోపు కథ సిద్ధం చేసి మరీ “దుబాయ్ శీను” షూటింగ్ మొదలెట్టాను. “అమర్ అక్బర్ ఆంటోనీ” కథ రెడీ చేసుకొని రవితేజ దగ్గరకి వెళ్తే “నెల టికెట్” తర్వాత స్టార్ట్ చేద్దామని తానే చెప్పాడు. సొ, రవితేజ నన్ను ఒక వ్యక్తిగా కంటే దర్శకుడిగా చాలా ఇష్టపడతాడు, గౌరవిస్తాడు కూడా. అందుకే రవితేజను నా ట్రబుల్ షూటర్ అంటాను.
వింటేజ్ శ్రీనువైట్ల కావాలి అంటుంటే చాలా సంతోషంగా ఉంటుంది..
నా కొత్త సినిమాల విడుదల సమయంలో సోషల్ మీడియాలో జనాలు “మాకు వింటేజ్ శ్రీనువైట్ల కావాలి” అని కామెంట్ చేస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. అలాగే.. నా కొత్త సినిమాల్లో నా మార్క్ మిస్ అవుతుందని కూడా అర్ధమైంది. అందుకే.. నేను “వెంకీ, దుబాయ్ శీను” సినిమాల టైమ్ లో ఎలా వర్క్ చేశానో.. అంతకుమించిన ఎనర్జీతో “అమర్ అక్బర్ ఆంటోనీ” సినిమాకి వర్క్ చేశాను. ఈ సినిమాతో అందరూ వింటేజ్ వైట్లను చూస్తారు. అలాగే.. సునీల్ క్యారెక్టర్ కూడా అప్పట్లో ఎలా నవ్వించేదో అంతకుమించి ఉంటుంది.
లయను ఒప్పించడానికి చాలా కష్టపడ్డాను..
మాకు సినిమాలో ఒక అమెరికన్ తెలుగు కిడ్ కావాల్సి వచ్చింది. ఇక్కడి నుంచి ఎవరినైనా తీసుకెళ్తే అక్కడి స్లాంగ్ రాదు. అందుకే అక్కడ ఉండే చిన్నపిల్లల కోసం వెతుకుతున్నప్పుడు లయగారి అమ్మాయి ఉందని తెలిసింది. కథ చెప్పగానే ఆమె కూడా వాళ్ళమ్మాయి యాక్ట్ చేయడానికి ఒప్పుకొన్నారు. తర్వాత ఆ అమ్మాయి తల్లి పాత్రకి ఎవరా అని ఆలోచిస్తున్న తరుణంలో.. లయ అయితేనే బాగుంటుందనిపించింది. కాస్త కష్టపడి ఆమె కన్విన్స్ చేసి సినిమాలో నటింపజేశాం.
రవితేజ కొడుకు కూడా యాక్ట్ చేయాల్సింది కానీ..
ఈ సినిమాలో రవితేజ చిన్నప్పటి పాత్రకి తొలుత రవితేజ కొడుకు మహాధన్ నే అనుకున్నాం. కానీ.. వీసా సమస్య కారణంగా మా షెడ్యూల్లో మార్పులు వచ్చాయి. ఆ టైమ్ కి మహాధన్ చదువులో బిజీ అయిపోవడంతో ఆ పాత్రకి వేరే అబ్బాయిని తీసుకోవాల్సి వచ్చింది. ఆ కుర్రాడు కూడా చూడ్డానికి రవితేజలాగే ఉంటాడు.
“అమర్ అక్బర్ ఆంటోనీ” హిట్ అయితే బాలీవుడ్ లో కూడా తీస్తాను..
నిజానికి “ఢీ” సమయంలోనే శత్రుగ్న సిన్హా గారు నా సినిమా రీమేక్ రైట్స్ కొనుక్కొని నన్ను హిందీలో రీమేక్ చేయమన్నారు. అప్పటికి నాకు క్లారిటీ లేక ఆ ప్రొజెక్ట్ చేయలేదు. ఆ తర్వాత “ఆగడు” చిత్రాన్ని రీమేక్ చేయమని నన్ను అడిగారు కానీ.. రీమేక్ రైట్స్ విషయంలో ఉన్న కన్ఫ్యూజన్ కారణంగా ప్రొజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లలేదు. ఇప్పుడు “అమర్ అక్బర్ ఆంటోనీ” మాత్రం నాకు బాలీవుడ్ లో తీయాలని ఉంది. ఇక్కడ రిజల్ట్ బట్టి అది సెట్ అవుతుంది.
– Dheeraj Babu