దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన వెండితెర కళాఖండం బాహుబలి కంక్లూజన్ ఇక్కడ, అక్కడ అని తేడా లేకుండా 1700 కోట్లు వసూలు చేసి ఔరా అనిపించింది. జపాన్ భాషలోనూ గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయి వందరోజులు పూర్తి చేసుకొని అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా అక్కడి డిస్ట్రిబ్యూటర్లు వందరోజుల వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిర్మాత శోభూ యార్లగడ్డ తో కలిసి రాజమౌళి హాజరయ్యారు. జపనీయులు వీరికి ఘన స్వాగతం పలికారు.
ఆ అభిమానానికి రాజమౌళి ఫిదా అయ్యారు. సోషల్ మీడియా వేదికపై తన ఆనందాన్ని పంచుకున్నారు. “జపాన్‌లోని టోక్యోలో ‘బాహుబలి 2’ ప్రదర్శన అద్భుతంగా సాగడానికి కారణమైన అభిమానుల్ని నిన్న రాత్రి కలవడం చాలా సంతోషంగా ఉంది. సినిమాలపై ప్రేమకు హద్దులంటూ లేవు. హ్యాపీ డే..” అని ట్వీట్ చేశారు. జపాన్‌లో ఈ సినిమాను పంపిణీ చేసిన వారికి ధన్యవాదాలు చెప్పారు. “‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ స్క్రీనింగ్‌లో సినీ అభిమానులతో కలిసి దిగిన ఫోటో, వీడియోను పోస్ట్ చేశారు. జపాన్ లో రికార్డు సృష్టించిన బాహుబలి 2 చైనాలో రిలీజ్ కావడానికి సిద్ధమైంది. వచ్చేనెల 4 న చైనాలో 4000 తెరలపై రిలీజ్ కానుంది. అక్కడ కూడా సంచలనం సృష్టించడం ఖాయం.