కిక్, దూకుడు, బిజినెస్ మ్యాన్ వంటి ఎన్నో సినిమాలకు అద్భుతమైన సంగీతాన్ని ఎస్ థమన్ అందించారు. తాజాగా ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలయికలో రూపుదిద్దుకుంటున్న అరవింద సమేత వీర రాఘవ సినిమాకి కూడా మంచి ఆల్బమ్ ఇచ్చారు. ప్రముఖుల నుంచి అభినందనలు అందుకుంటున్నారు. ప్రసంశలు మాత్రమే కాదు విమర్శలు కూడా ఎక్కువగానే అందుకుంటున్నారు. ఎందుకంటే ఇందులోని పాటలు.. ఇది వరకు అతనే స్వయంగా కంపోజ్ చేసిన పాటల ట్యూన్స్ ని పోలి ఉన్నాయని మీమ్స్ చేస్తున్నారు. ఆ పాటలను.. ప్రస్తుత పాటలను మ్యాచ్ చేసి వీడియోలు రూపొందిస్తున్నారు. క్యాపి క్యాట్ అని ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్రోల్స్ థమన్ కి కోపం తెప్పించాయి. దీంతో థమన్ విమర్శకులపై మండి పడుతున్నారు. “నా పాటను మళ్ళీ నేను వాడుకుంటే కాపీ అని ఎలా అంటారు? ఓ రచయిత ఒక పాటలో ‘ప్రేమ’ అని పదాన్ని రాస్తారు.
మళ్ళీ ఇంకో పాటలో ‘ప్రేమ’ అని రాస్తే కాపీ అంటారా? ఇటువంటి విమర్శలపై ఐ డోంట్ కేర్. సోషల్ మీడియాలో ఎవరో ఏవో కామెంట్స్ చేస్తే పట్టించుకోను. వాటికి ప్రాధాన్యం ఇస్తే నేను నా పని చేసుకోలేను” అని థమన్ స్పష్టం చేశారు. ఇంకా మాట్లాడుతూ … “ఒక్కొక్కరికీ ఒక్కో స్టైల్ ఉంటుంది. నా స్టైల్ నాది. అసలు కాపీ అనడమే తప్పు. మళ్ళీ మళ్ళీ విమర్శిస్తే నేనేం చేయను. నన్ను నేను డిఫెండ్ చేసుకోవడం కోసం ఏదో ఒకటి మాట్లాడను. కామెంట్ చేయడం వాళ్ల బతుకు అనుకుంటే బతకనివ్వండి. హ్యాపీగా కామెంట్ చేసుకోమనండి. నాకు ఏం నష్టం లేదు. హీరోలు, దర్శకులు, నిర్మాతలు నన్ను నమ్ముతున్నారు. విమర్శల వల్ల నాకు పోయేది ఏమీ లేదు” అని తేల్చి చెప్పారు. ఇక నుంచి అయినా థమన్ పై విమర్శలు ఆగుతాయోమొ చూడాలి.