SSMB29: హీరోయిన్ మదర్ నుంచి ఓ లీక్!

సూపర్‌స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)  , రాజమౌళి  (S. S. Rajamouli)  కాంబినేషన్‌లో తెరకెక్కనున్న SSMB 29 గురించి ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ వరల్డ్ లెవెల్‌లో రూపొందనున్న ఈ సినిమా కథను విజయేంద్ర ప్రసాద్ ఇండియానా జోన్స్ తరహాలో రాసినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు? అన్న ప్రశ్న అభిమానులను వెంటాడుతూనే ఉంది. ఇప్పటివరకు చిత్రబృందం ఈ విషయంలో సరైన క్లారిటీ ఇవ్వలేదు. కానీ బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) పేరు బలంగా వినిపిస్తుండగా, తాజాగా ఆమె తల్లి మధు చోప్రా మాత్రం ఆసక్తికరంగా స్పందించారు.

SSMB29

ప్రియాంక చోప్రా ఇటీవల హైదరాబాద్‌లో కనిపించడం, అక్కడ షూటింగ్‌లో పాల్గొంటుండడం, దేవాలయాలను సందర్శించడం ఇవన్నీ ఆమె SSMB 29లో నటిస్తున్నదన్న ఊహాగానాలకు బలాన్ని చేకూర్చాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మధు SSMB29 ప్రశ్నపై మాట్లాడుతూ “అవును, ప్రియాంక ప్రస్తుతం సినిమా షూటింగ్ చేస్తోంది” అని అన్నారు. దీంతో మహేష్ బాబు సినిమాకు ఆమె ఫైనల్ అయినట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు, మధు చోప్రా టొరంటో నుండి హైదరాబాద్‌కు తన ప్రయాణాన్ని డాక్యుమెంట్ చేసిన వీడియోలో RRR నేపథ్య సంగీతం వినిపించడంతో ఈ వార్త మరింత హైప్ అందుకుంది.

ఇంతకు ముందు హైదరాబాద్ వచ్చిన ప్రియాంక చోప్రా చిలుకూరు బాలాజీ ఆలయాన్ని దర్శించుకుని, “శ్రీ బాలాజీ ఆశీర్వాదంతో కొత్త అధ్యాయం మొదలుపెడుతున్నా” అంటూ కామెంట్ చేయడం విశేషం. ఈ వ్యాఖ్యలు ఆమె SSMB 29 గురించి హింట్ ఇచ్చినట్లేనని ఫ్యాన్స్ విశ్లేషిస్తున్నారు. అయినప్పటికీ, చిత్రబృందం మాత్రం ఇంకా అధికారికంగా ఏదీ ప్రకటించలేదు. ఈ ప్రాజెక్ట్ జనవరిలో హైదరాబాద్‌లో పూజా కార్యక్రమంతో లాంచ్ అయినప్పటికీ, మహేష్ బాబు లుక్‌ను ఇంకా గోప్యంగా ఉంచారు.

సినిమా కథ, కాస్టింగ్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోవడంతో మరింత ఆసక్తి పెరుగుతోంది. ప్రియాంక నిజంగా ఇందులో నటిస్తున్నారా? లేక ఇది కేవలం మరో రూమరా? అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే మధు చోప్రా వ్యాఖ్యలు ఇప్పుడు ఈ లీక్‌ను ఖచ్చితంగా నిజమైందని అనిపించేలా చేస్తున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus