సాధారణంగా సినిమా సెట్స్‌లో ప్లాస్టిక్ బాటిల్స్, ఇతర నాన్-రీసైక్లబుల్ వస్తువులు కనిపించడం సహజమే. కానీ ఎస్ ఎస్ రాజమౌళి (S. S. Rajamouli) సినిమా అంటే, ప్రతిదీ డిఫరెంట్‌గానే ఉంటుంది. విజువల్స్, స్క్రీన్‌ప్లే, గ్రాండియర్ మాత్రమే కాదు.. సెట్స్‌లో డిసిప్లిన్ విషయంలోనూ జక్కన్న స్పెషల్ రూల్స్ పెట్టడం కొత్తేమీ కాదు. తాజాగా SSMB 29 షూటింగ్‌లో రాజమౌళి మరో నూతన రూల్ తీసుకువచ్చారు. ఇకపై ఈ ప్రాజెక్ట్ సెట్స్‌లో ప్లాస్టిక్ బాటిల్స్‌ను పూర్తిగా నిషేధించినట్లు సమాచారం.
ఇది కేవలం ఒక డిసిప్లిన్ నిర్ణయం మాత్రమే కాదు, నిర్మాతలకు కూడా లాభదాయకమని తెలుస్తోంది. రోజుకు 2000 మందికి పైగా పని చేసే సెట్లో ప్రతిరోజూ వందల కొద్దీ ప్లాస్టిక్ బాటిల్స్ వినియోగంలో ఉంటాయి. వీటిని బదులుగా గాజు బాటిల్స్ అందుబాటులో ఉంచి మళ్లీ రీసైకిల్ చేసేలా ప్లాన్ చేశారు. అంటే ఎవరికి వారు ఒక గాజు గ్లాస్ ఫిక్స్ చేసుకొని, వాటర్ అయిపోతే మళ్ళీ అదే గ్లాస్ లో వాటర్ తీసుకునేలా రూల్ సెట్ చేసినట్లు టాక్.
దీని వల్ల వ్యర్థాల నిర్వహణ సమస్య తగ్గడమే కాకుండా, ప్రొడక్షన్ ఖర్చులు కూడా భారీగా తగ్గనున్నాయి. సమాచారం ప్రకారం, ఈ నిర్ణయంతో యూనిట్ దాదాపు 2 కోట్ల రూపాయల వరకు ఖర్చు తగ్గించుకున్నట్లు టాక్. ఈ రూల్ కేవలం మహేష్ బాబు (Mahesh Babu) మాత్రమే కాదు, బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) , రాబోయే హాలీవుడ్ నటీనటులందరికీ వర్తించనుంది. రాజమౌళి సినిమాల్లో అన్నీ క్రమశిక్షణగా నడవడానికి కారణాల్లో ఒకరు ఆయన భార్య రామా రాజమౌళి (Rama Rajamouli) అయితే, మరో కీలక వ్యక్తి కీరవాణి (M. M. Keeravani) భార్య వల్లి.
లైన్ ప్రొడ్యూసర్‌గా ఆమె రాజమౌళి సినిమాల్లో కీలక పాత్ర పోషిస్తుంటారు. ప్లాస్టిక్ నిషేధానికి సంబంధించిన ఆలోచన కూడా ఆమె నుంచే వచ్చినట్లు టాక్. ఈ నిర్ణయం మిగిలిన చిత్ర యూనిట్లకు కూడా ఓ మార్గదర్శకంగా నిలిచే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రభుత్వాలు ప్లాస్టిక్ నిషేధానికి పలు చర్యలు తీసుకుంటున్నాయి. కానీ సినీ పరిశ్రమ వంటి పెద్ద రంగాల్లో ఇది అమలైతే, ఇతర ఫిల్మ్ మేకర్స్ కూడా దీన్ని ఫాలో అయ్యే అవకాశం ఉంది.
SSMB 29 వెయ్యి కోట్ల బడ్జెట్‌లో రూపొందుతున్న సినిమాగా భారీ స్థాయిలో ప్రొడక్షన్ జరుగుతున్నప్పటికీ, ఖర్చులు తగ్గించేందుకు రాజమౌళి ఎలాంటి మార్గాలను ఎంచుకుంటున్నారో ఇదే ఉదాహరణ. ఈ ప్రాజెక్ట్ సెట్స్‌లో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తొలగించడం కచ్చితంగా ఓ కొత్త ట్రెండ్ సెట్ చేయనుంది. రాజమౌళి తన ప్రతి సినిమాతో కొత్త స్టాండర్డ్స్‌ను తీసుకొచ్చినట్లే, ఇప్పుడు ఈ కొత్త రూల్ ద్వారా మరోసారి తన విభిన్నతను నిరూపించుకున్నారు.