అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న గ్లోబల్ ప్రాజెక్ట్ వారణాసి మాత్రమే. దీని గురించి బయట రకరకాల వార్తలు వస్తున్నా, ఇండస్ట్రీ ఇన్ సైడర్స్ నుంచి వచ్చే సమాచారం మాత్రం గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ముఖ్యంగా దర్శకుడు దేవకట్టా ఈ సినిమా విజువల్స్ గురించి చెప్పిన ఒక పాయింట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.
VARANASI
రాజమౌళి సినిమాలు అంటేనే గ్రాఫిక్స్, భారీతనం కామన్. కానీ ఈసారి రాబోయే సినిమా ‘ఈగ’, ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలను మించిపోతుందట. ఇప్పటివరకు మనం చూసిన జక్కన్న మార్క్ విజువల్స్ ఒకెత్తు, ఈ సినిమాలో చూడబోయేది మరొక ఎత్తు అని దేవకట్టా హింట్ ఇచ్చారు. దేవకట్ట సినిమా కథ విషయంలో రాజమౌళితో కలిసి వర్క్ చేశారు. హాలీవుడ్ లో వార్నర్ బ్రదర్స్, జేమ్స్ కామెరూన్ సినిమాలకు ఏమాత్రం తగ్గని క్వాలిటీతో ఈ అవుట్ పుట్ ఉండబోతోందని, తెలుగు సినిమా ఖ్యాతిని ఇది నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తుందని ఆయన మాటల్లో అర్థమవుతోంది.
సాధారణంగా గ్రాఫిక్స్ ఎక్కువైతే అక్కడ ఎమోషన్ మిస్ అవుతుంది, లేదా లాజిక్ పక్కకు పోతుంది. కానీ ఈ సినిమా స్పెషాలిటీ ఏంటంటే.. ఎంత భారీ విజువల్స్ ఉన్నా, ఎక్కడా ‘రియాలిటీ’ మిస్ అవ్వదట. గ్రాఫిక్స్ మాయాజాలం ఉన్నా, అది కథలో భాగంగా, చాలా సహజంగా ఉంటుందని దేవకట్టా చెప్పుకొచ్చారు. అంటే ప్రేక్షకుడికి కళ్లు చెదిరే ట్రీట్ ఇస్తూనే, లాజిక్ కు కూడా పెద్దపీట వేస్తున్నారన్నమాట. విజువల్ ఎఫెక్ట్స్ వాస్తవికతను చెడగొట్టకుండా ఉండటమే ఈ సినిమా ప్రధాన బలమని తెలుస్తోంది.
దాదాపు రూ. 900 కోట్ల బడ్జెట్ అని ప్రచారం జరుగుతున్న ఈ చిత్రంలో, ఇండియానా జోన్స్ తరహా అడ్వెంచర్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి. అడవులు, కొండల నేపథ్యంలో సాగే ఈ కథలో ఎమోషన్ కూడా పీక్స్ లో ఉంటుందట. కేవలం విజువల్ వండర్ గానే కాకుండా, బలమైన కథతో వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సునామీ సృష్టిస్తుందో ఊహించలేం. ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ వంటి అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్న తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడంతో, వరల్డ్ వైడ్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకునే ఈ ప్రయోగం చేస్తున్నారు.