బాలీవుడ్ లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసిన శ్రేయాస్ తల్పడే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ‘ఇక్బాల్’ సినిమాలో అతడి పెర్ఫార్మన్స్ చూసిన ప్రేక్షకులు మైమరచిపోయారు. మూగ క్రికెటర్ పాత్రలో నటించిన మెప్పించాడు. ఈ సినిమాలో తన పెర్ఫార్మన్స్ కి నేషనల్ అవార్డు సైతం అందుకున్నాడు. ఇదిలా ఉండగా.. రీసెంట్ గా శ్రేయాస్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇందులో బాలీవుడ్ నటుల ప్రవర్తనపై కామెంట్స్ చేసిన ఆయన స్నేహితుల పేరుతో చాలా మంది తనను మోసం చేశారని తెలిపాడు.
చాలాసార్లు తన స్నేహితులు కావాలని పక్కన పెట్టేవారని.. ఆ సమయంలో ఎంతో కుమిలిపోయేవాడినని చెప్పుకొచ్చాడు. ఒత్తిడికి లోనైన ప్రతిసారి ‘ఇక్బాల్’ సినిమాను గుర్తుకు చేసుకొని తనను ఓదార్చుకునేవాడినని చెప్పాడు. అమితాబ్ బచ్చన్ లాంటి వారు కూడా ఇలాంటి కష్టాలను దాటుకొని ఎదిగినవారేనని అలాంటి వారితో పోలిస్తే తానెంత అని అన్నాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో తనకు లభించిన స్థానానికి సంతోషంగా ఉన్నానని.. మంచి పాత్రల కోసం ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చాడు. ఇండస్ట్రీలో ఎవరూ నిజమైన స్నేహితులు కారని.. ఎప్పటికప్పుడు అక్కడ సమీకరణాలు మారిపోతాయని అన్నాడు.
పేరుకి ఫ్రెండ్స్ అని చెప్పినా.. వాళ్లు సినిమా తీసే టైమ్ కి మనల్ని దూరంగా ఉంచాలని చూస్తారని అన్నారు. కొందరు నటులకైతే ఈగో ఓ రేంజ్ లో ఉంటుందని.. వాళ్లకు తనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అసలు ఇష్టముండదని చెప్పుకొచ్చాడు. తన స్నేహితుల కోసం కొన్ని సినిమాలు చేశానని.. కానీ చివరకు వాళ్లే తనను ఒంటరి చేసి వెన్నుపోటు పొడిచారని బాధపడ్డాడు. ఇండస్ట్రీలో దాదాపు తొంబై శాతం మంది ఇలానే ఉంటారని.. పది శాతం మంది మాత్రమే మన ఎదుగుదలను చూసి సంతోషిస్తారని చెప్పుకొచ్చాడు.