సింగిల్ సినిమాతో స్టార్ అయిపోవడం అంత ఈజీ కాదు. ఇలాంటి ఫీట్‌ను రీసెంట్‌గా సాధించిన యువ నటుడు విక్రాంత్ మస్సే (Vikrant Massey). బాలీవుడ్ సినమా ‘ట్వెల్త్ ఫెయిల్’తో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాడు విక్రాంత్ మస్సే (Vikrant Massey). ఇలాంటి నటుడు వరుస సినిమాలు చేసి ప్రేక్షకుల్ని అలరిస్తే చాలు అని అభిమానులు అనుకుంటుండగా.. ఆయన షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఏమైందా అంటూ నెటిజన్లు, అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. కొంత కాలంపాటు కొత్త సినిమాలు చేయబోనంటూ విక్రాంత్ మస్సే విరామం ప్రకటించారు.
ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ నోట్ విడుదల చేశారు. కొన్ని సంవత్సరాలుగా ప్రేక్షకుల నుండి అసాధారణమైన ప్రేమను, అభిమానాన్ని పొందుతున్నాను. మీ అందరి మద్దతుకు ధన్యవాదాలు. ఇక కుటుంబ సభ్యులకు నా పూర్తి సమయాన్ని కేటాయించాల్సిన టైమ్ వచ్చింది అని రాసుకొచ్చాడు. ఇప్పుడు కొత్త సినిమాలను అంగీకరించడం లేదు. సరైన సమయం వచ్చేంతవరకు 2025లో విడుదల కానున్న మూడు సినిమాలే చివరివి. నాకు ఎన్నో అందమైన జ్ఞాపకాలను ఇచ్చారు అని కూడా నోట్‌లో రాసుకొచ్చాడు విక్రాంత్ మస్సే.
ఆయన సినిమాలు ఇప్పుడు మూడు సెట్స్ మీద ఉన్నాయి. ‘యార్ జిగ్రీ’, ‘టీఎంఈ’, ‘ఆంఖోకి గుస్తాకియాన్’ వచ్చాక ఇక విక్రాంత్ సినిమాలు ఇప్పట్లో రావు. విక్రాంత్ అకస్మాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో చెప్పాలని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. నిర్ణయం విషయంలో మరోసారి ఆలోచించాలని కోరుతున్నారు. అయితే ఇదేమైనా సినిమా ప్రచారమా? అనే డౌట్ కూడా చాలామందిలో ఉంది. ఇక విక్రాంత్ గురించి చూస్తే.. బాలికా వధు (చిన్నారి పెళ్లికూతురు) సిరీయల్‌తో అందరికీ పరిచయం అయ్యాడు.
2017లో ‘ఎ డెత్ ఇన్ ది గంజ్’ సినిమాతో హీరోగా కనిపించి ఆకట్టుకున్నాడు. గతేడాది విడుదలైన ‘ట్వెల్త్ ఫెయిల్’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు విక్రాంత్. ఇక ఇటీవల జరిగిన ‘ఇఫీ’ వేడుకల్లో ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్’ పురస్కారాన్ని అందుకున్నాడు. ఇప్పుడు హఠాత్తుగా సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అది ఎన్ని రోజులు అనేది తెలియాలి.