సినిమా తారల దుస్తులు వేలం వేయడం కొత్తేమీ కాదు. దేశ విదేశాల్లో చాలామంది తారల దుస్తులు వేలం వేసిన సందర్భాలున్నాయి. వాటికి ఊహించనంత ధర పలికిన ఘటనలూ ఉన్నాయి. తాజాగా అలాంటి సందర్భమే మరోసారి రాబోతోందా? విద్య బాలన్ మాటలు వింటుంటే అలానే అనిపిస్తోంది. ఎంతగానో నచ్చి, మెచ్చి కొనుక్కున్న చీరను విద్య బాలన్ త్వరలో వేలం వేస్తోంది. ఆన్‌లైన్ వేదికగా ఆమె తన చీరను వేలం పెట్టింది. ఈ పని ఎందుకు చేస్తోందనేగా.. అయితే ఈ వార్త చదివేయండి.
పేద పిల్లలకు కథల ద్వారా విజ్ఞానాన్ని అందించే ఓ ప్రాజెక్టుకు తన వంతు సాయం అందించడానికి ప్రముఖ బాలీవుడ్ నటి విద్య బాలన్ ముందుకొచ్చింది. దీని కోసం తనకు ఎంతో ఇష్టమైన చీరను వేలంలో ఉంచింది. దాని ద్వారా వచ్చే డబ్బును టీసీఎల్పీ నిర్వహిస్తోన్న కమ్యూనిటీ లైబ్రరీ ప్రాజెక్టుకు విరాళంగా అందించనుంది. ‘దేశంలో ఎక్కడికెళ్లినా ఆయా ప్రాంతాల్లో నేసే చీరలను సేకరించడం నాకు అలవాటు. అంతేకాదు వాటిని అప్పుడప్పుడు పంచిపెట్టడమూ నా హాబీ. పుస్తక పఠనమన్నా చాలా ఇష్టం. సమయం ఉన్నప్పుడల్లా నా చుట్టూ పుస్తకాలే ఎక్కువగా ఉంటాయి’’ అని చెప్పింది విద్య బాలన్.
‘‘పేద పిల్లలకు పుస్తకపఠనంపై ఆసక్తిని పెంచి, వారిలో విజ్ఞానాన్ని పెంపొందించే ఆశయంతో ముందుకొచ్చిన కమ్యూనిటీ లైబ్రరీ ప్రాజెక్టులో భాగస్వామురాలిని అవుతున్నా. దీని కోసం నాకిష్టమైన ప్యూర్ టస్సర్ చీరను ఆన్‌లైన్‌లో వేలంలో పెడుతున్నా. దీన్ని వేలం వేయగా వచ్చే నగదును లైబ్రరీ ప్రాజెక్టుకు అందిస్తా. ఇదే స్ఫూర్తితో దేశవ్యాప్తంగా ఇలాంటి ఉచిత లైబ్రరీలు మరిన్ని రావాలని ఆశిస్తున్నాను’’ అని చెప్పింది విద్య బాలన్. చదివారుగా ఆమె ఆలోచన… మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.