సినిమా ఇండస్ట్రీలో జయాపజయాలు కామన్. కానీ కొందరు మాత్రం ఓటమికి కుంగిపోయి అక్కడే ఆగిపోతారు. దాని నుండి బయటపడడానికి చాలా కష్టాలు పడుతుంటారు. దర్శకుడు రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా కూడా జీవితంలో ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొన్నాడు. అతడు తెరకెక్కించిన ‘ఢిల్లీ 6’ సినిమా 2009లో విడుదలైంది. అభిషేక్ బచ్చన్, సోనమ్ కపూర్ జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలింది. ఆ సమయంలో రాకేష్ ఓంప్రకాష్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడట.
ఈ విషయాన్ని తన ఆటోబయోగ్రఫీ ‘ది స్ట్రేంజర్ ఇన్ ది మిర్రర్’లో రాసుకొచ్చాడు. ‘ఢిల్లీ 6’ సినిమా ప్లాప్ అవ్వడంతో తను ఎంతగానో బాధపడ్డానని పేర్కొన్నాడు. థియేటర్లలో ఈ సినిమాను ప్రదర్శించినప్పుడు సినిమా ఇంకా పూర్తి కాకుండానే ప్రేక్షకులు విసిగిపోయి బయటకు వెళ్లిపోయారని తెలిపాడు. అంతేకాకుండా తనను చంపుతామని బెదిరించారని.. దీంతో చీకటి ప్రదేశంలోకి వెళ్లి తలదాచుకున్నానని గుర్తు చేసుకున్నాడు. ఈ బాధలను భరించలేక తాగుడుకు బానిసయ్యానని.. ఒకానొక సమయంలో ఫుల్ గా తాగి చనిపోవాలనుకున్నానని రాసుకొచ్చాడు.
తన ప్రవర్తనతో భార్య, బిడ్డలను ఇబ్బంది పెట్టానని.. తన కొడుకు వేదాంత్ తో దూరం పెరిగిందని పేర్కొన్నాడు. ఆ తరువాత ‘రంగ్ దే బసంతి’, ‘భాగ్ మిల్కా భాగ్’ వంటి సినిమాలతో హిట్స్ అందుకున్నాడు. రీసెంట్ ఈ డైరెక్టర్ రూపొందించిన ‘తుఫాన్’ సినిమా ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.