మెగాస్టార్ చిరంజీవి 151 వ చిత్రంగా రాబోతున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం టీజర్ ఇటీవల విడుదలై యూట్యూబ్లో రికార్డులు క్రియేట్ చేస్తుంది. కేవలం తెలుగు టీజర్ కి మాత్రమే కాదు మిగిలిన భాషల్లో విడుదల చేసిన టీజర్ కి కూడా అద్భుతమైన స్పందన లభించింది. ఇదిలా ఉండగా.. హిందీలో లో కూడా ఈ చిత్రాన్ని అక్టోబర్ 2 కే విడుదల చేయబోతున్నారు. అయితే ఇప్పుడు దానికి సంబంధించిన ఓ విషయం చిత్ర యూనిట్ ని కలవరపెడుతోందట. ‘సైరా’ రిలీజ్ అవుతున్న అక్టోబర్ 2నే బాలీవుడ్ లో భారీ యాక్షన్ చిత్రమైన ‘వార్’ విడుదల కాబోతుంది. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలసి నటిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డయి. హృతిక్, టైగర్ ష్రాఫ్ లకు బాలీవుడ్ లో ఎటువంటి క్రేజ్ ఉందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రం అదే రోజున విడుదలైతే ‘సైరా’ కలెక్షన్లకి పెద్ద దెబ్బపడినట్టే.
అయితే ‘వార్’ చిత్రం విడుదల వాయిదా పడే అవకాశం కూడా ఉందని టాక్. యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. గతేడాది ఈ సంస్థ నిర్మించిన ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ చిత్రం పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఈ చిత్రం కొన్న బయ్యర్లు దారుణంగా నష్టపోయారు. ఆ నష్టాలని కొంతవరకైనా భర్తీ చేసి తమని ఆదుకోవాలని డిస్ట్రిబ్యూటర్లు ఈ నిర్మాతల్ని కోరగా వారు నిరాకరించారట. కనీసం ‘వార్’ హక్కుల్ని తక్కువ రేటుకు అమ్మాలని కోరినా వినట్లేదట. దీనితో బయ్యర్లంతా ‘వార్’ చిత్రాన్ని కొనుగోలు చేయకూడదని డిసైడ్ అయ్యినట్టు తెలుస్తుంది. ఈ సమస్య ముదిరితే ‘వార్’ చిత్రం వాయిదా పడటం ఖాయం. అప్పుడు ‘సైరా’ కి కలిసొచ్చే అవకాశం ఉంటుంది. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి..!