ప్రస్తుతం సినీ పరిశ్రమల్లో ఉన్న పోటీని తట్టుకొని పదేళ్లు నిలబడడం ఎంతో కష్టం.. అటువంటిది చెన్నై బ్యూటీ పదిహేను ఏళ్లకు పైగా సినిమాలు చేస్తోంది. దక్షిణాది అన్ని పరిశ్రమల్లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ లోను ఓ సినిమా చేసింది. నటన కోసం పెళ్లిని కూడా క్యాన్సల్ చేసుకున్న ఈ బ్యూటీ పై వృత్తిపరమైన సమస్యలతో ఏ నిర్మాత, దర్శకుడు ఇప్పటివరకు ఫిర్యాదు చేయలేదు. కానీ తొలిసారి త్రిషపై విమర్శలు వచ్చాయి. ఆమెకి పొగరువచ్చిందని ఓ నిర్మాత అందరిముందు చెప్పారు. ఆ నిర్మాత జ్ఞానవేల్ రాజా. విజయ్ ఆంటోనీ నటించిన అన్నాదురై ఆడియో ఫంక్షన్ కి వచ్చిన ఆయన పేరు చెప్పకుండా త్రిషపై కామెంట్లు చేశారు.
“రీసెంట్ గా ఓ హీరోయిన్ ను కలిసేందుకు ఆ చిత్ర నిర్మాతతో కలిసి హోటల్ కు వెళ్లాం. 10 గంటలకు పైగా అక్కడ వెయిట్ చేసినా ఆమె మమ్మల్ని కలిసేందుకు ఇష్టపడలేదు. పెద్దలను గౌరవించలేని వ్యక్తులు ఇండస్ట్రీలో ఉన్నారు” అంటూ జ్ఞానవేల్ రాజా ఆరోపించారు. దీంతో విక్రమ్ హీరోగా నటిస్తున్న సామీ స్క్వేర్ షూటింగ్ నుంచి త్రిష బయటికి వచ్చిందనే విషయం నిజమేనని అందరూ అనుకుంటున్నారు. అయితే ఈ విషయంపై త్రిష ఇంకా స్పందించలేదు. ఆమె నోరు విప్పితే గానీ అసలు విషయం బయటికి రాదు. ప్రస్తుతం త్రిష ఐదు తమిళ చిత్రాలు, ఒక మలయాళం చిత్రం చేస్తూ బిజీగా ఉంది.