జాతీయ సినీ అవార్డుల ప్రదానోత్సవం

రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ తో పాటు పలువురు కేంద్ర మంత్రులు ఉండే వేదికపై అవార్డు అందుకోవడమే మహా భాగ్యం అని అందరూ అనుకుంటారు. అటువంటి వేదికపై మాట్లాడే అవకాశాన్ని కళాతపస్వి కె.విశ్వనాథ్‌ దక్కించుకున్నారు. 64వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానం సందర్భంగా దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డును రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా ఆయన అందుకున్నారు. అనంతరం కె.విశ్వనాథ్‌ మాట్లాడుతూ “ఎందరో మహానుభావులు… అందరికీ వందనాలు. నేనీ స్థాయికి చేరుకోవడానికి నా తల్లిదండ్రులు, భగవంతుని ఆశీస్సులే కారణం’ అన్నారు  జాతీయ అవార్డుల చరిత్రలో అవార్డు గ్రహీత మాట్లాడడం ఇదే తొలిసారి. ఈ వేడుకకు విశ్వనాథ్‌ భార్య జయలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వర్ణకమలం, రూ.10 లక్షలు నగదు పురస్కారంతో పాటు శాలువాతో విశ్వనాథ్‌ను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, వెంకయ్యనాయుడు, కేంద్ర సహాయ మంత్రి రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్‌లు సత్కరించారు.

జాతీయ ఉత్తమ నటుడిగా అక్షయ్‌కుమార్‌, ఉత్తమ నటిగా సురభి లక్ష్మి అవార్డులు అందుకున్నారు. తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికైన ‘పెళ్లిచూపులు’ నిర్మాత రాజ్‌ కందుకూరి, చిత్ర దర్శకుడు తరుణ్‌భాస్కర్‌ దాస్యం రజత కమలం, లక్ష అందుకొన్నారు. ఉత్తమ సంభాషణలకు గానూ తరుణ్‌భాస్కర్‌ రజత కమలం, 50 వేలు తీసుకున్నారు. ఉత్తమ ప్రజాదరణ పొందిన వినోదాత్మక చిత్రంగా ఎంపికైన ‘శతమానం భవతి’ నిర్మాత వి.వెంకటరమణారెడ్డి (దిల్‌రాజు), దర్శకుడు సతీశ్‌ వేగేశ్న స్వర్ణ కమలం, 2 లక్షలు అందుకొన్నారు. ‘జనతా గ్యారేజ్‌’ సినిమాలోని ‘ప్రణామం… ప్రణామం…’ పాటకు గానూ నృత్య దర్శకుడు రాజు సుందరం రజత కమలం తీసుకున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus