హీరోయిన్ గా 15 ఏళ్ల సక్సెస్ ఫుల్ కెరీర్ ను ఆస్వాదించిన తర్వాత నిర్మాతగానూ తన మార్క్ ను ప్రూవ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తూ సమంత రుత్ ప్రభు నిర్మించిన చిత్రం “శుభం” (Subham). “సినిమా బండి” ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్ & ప్రమోషనల్ కంటెంట్ మంచి ఆసక్తి నెలకొల్పింది. మరి సినిమాగా ఏమేరకు ఆకట్టుకుంది? సమంత నిర్మాతగా తన తొలి ప్రయత్నంలో విజయం సాధిందిందా? అనేది చూద్దాం..!!
కథ: అది 2000 సంవత్సరం, భీమిలి అనే ఊర్లో ఆడవాళ్లందరూ రాత్రి సరిగ్గా 9.00 గంటలకు జీ తెలుగు ఛానల్లో ప్రసారమయ్యే “జన్మ జన్మల బంధం” అనే సీరియల్ ఎప్పుడు సుఖాంతం అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు.
అలా వెయిట్ చేసేవాళ్లలో శ్రీవల్లి (శ్రియ కొంతం), ఫరీదా (షాలిని కొండెపూడి), గాయత్రి (శ్రావణి లక్ష్మి) కూడా ఉంటారు.
ఈ సీరియల్ ను వాళ్ళు చూసే విధానం మొగుళ్లందరి గుండెలు గుబేలుమనిపిస్తుంది. అసలు రాత్రి 9.00 గంటలకు భీమిలిలో ఏమవుతుంది? ఆడాళ్లందరూ “జన్మ జన్మల బంధం” సీరియల్ కి ఎందుకు అడిక్ట్ అయిపోతున్నారు? ఈ సమస్య నివారణ కోసం మొగుళ్లందరూ కలిసి ఏం చేశారు? అనేది “శుభం” (Subham) కథాంశం.
నటీనటుల పనితీరు: హర్షిత్ లో మంచి ఈజ్ ఉంటుంది. ఎలాంటి ఎమోషన్ అయినా సరే సహజంగా పండిస్తాడు. ఈ సినిమాలోనూ శ్రీనివాస్ అనే యువకుడి పాత్రలో ఒదిగిపోయాడు. తెలంగాణ కుర్రాడు అయినప్పటికీ, ఉత్తరాంధ్ర యాస మాట్లాడడంలో మంచి చొరవ చూపించాడు. అలాగే.. విభిన్నమైన షేడ్స్ ను కూడా ఒద్దికగా ప్రదర్శించాడు.
శ్రీనివాస్ గవిరెడ్డిలో మంచి కామెడీ టైమింగ్ ఉంది. అది ఈ సినిమాతో బయటపడిందనే చెప్పాలి. భార్య చేతిలో తన్నులు తిని బయటికి చెప్పుకోలేని ఓ టిపికల్ మొగుడిగా, మగాడిగా అతడి మాట తీరు, బాడీ లాంగ్వేజ్ కడుపుబ్బా నవ్విస్తుంది. చరణ్ పేరి ఎందుకో పూర్తిస్థాయిలో ఎలివేట్ అవ్వలేదు అనిపించింది. పెళ్ళాం చేతిలో తన్నులు తినే సన్నివేశాల్లో ఎక్స్ ప్రెషన్స్ బాగున్నప్పటికీ, కథనంలో ఎక్కడా తనదైన మార్క్ వేయలేకపోయాడు.
ఇక మహిళామణులు శ్రియ కొంతం, షాలిని కొండెపూడి, శ్రావణి లక్ష్మిలలో.. షాలిని చాలా సహజమైన నటనతో ఆకట్టుకుంది. ముఖ్యంగా ప్రతాత్మ పాత్రలో పరకాయ ప్రవేశం చేసేసింది. దెయ్యం పట్టిన అమ్మాయిగా ఆమె హావభావాలు చాలా సహజంగా ఉన్నాయి. శ్రియ కొంతంలో కొత్తగా పెళ్లైన యువతిలో ఉండే కన్ఫ్యూజన్ కొట్టొచ్చినట్లు కనబడింది. ముఖ్యంగా.. చివర్లో వచ్చే దెయ్యం సీక్వెన్సుల్లో ఆమె నటన ఆకట్టుకుంటుంది. శ్రావణి లక్ష్మి అమాయకమైన సతీమణిగా ఒదిగిపోయింది.
వంశీధర్ గౌడ్ కామెడీ టైమింగ్ అలరించింది. ఇక మాత పాత్రలో సమంత కనిపించేది రెండే సీన్స్ అయినప్పటికీ.. ఆమె పాత్ర కథనాన్ని నడిపించేది అవ్వడం ప్లస్ పాయింట్ అయ్యింది.
సాంకేతికవర్గం పనితీరు: వివేక్ సాగర్ నేపథ్య సంగీతం సినిమాని, సినిమాలోని ఎమోషన్ ను అద్భుతంగా ఎలివేట్ చేసింది. ఓపెనింగ్ సీక్వెన్సుల్లో వచ్చే 90ల నాటి మ్యూజిక్ ట్రీట్మెంట్ మంచి నాస్టాలిజీయా ఫీల్స్ ఇస్తుంది. అలాగే.. షోర్ పోలీస్ ర్యాప్ సాంగ్స్ పాత కథకు కొత్త ఫీల్ ఇచ్చింది. సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ గా ఉంది. ఆర్ట్ వర్క్ & ప్రొడక్షన్ టీమ్ 2000 టైంలైన్ ను మైంటైన్ చేయడంలో సక్సెస్ అయ్యారు.
వసంత్ మరింగంటి కథలో చాలా పాయింట్స్ రిలేటబుల్ గా ఉన్నాయి. ముఖ్యంగా సీరియల్ అడిక్షన్ & సీరియల్ ను మేరక్స్ సాగదీసే విధానం మీద వేసిన సెటైర్లు బాగా పేలాయి.
దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల ఈ కథను నడిపిన విధానం అలరించింది. ఇంటర్వెల్ బ్యాంగ్ కోసమని ఫస్టాఫ్ ను కాస్త సాగదీసిన ఫీలింగ్ వచ్చినప్పటికీ.. సెకండాఫ్ ను డీల్ చేసిన విధానం, మరీ ముఖ్యంగా “ఫెమినిజం” అనే కాన్సెప్ట్ ను ఎక్కడా బోర్డర్ క్రాస్ అవ్వనివ్వకుండా ట్రీట్ చేసిన తీరు దర్శకుడిగా అతడి ప్రతిభకు నిదర్శనంగా నిలిచాయి. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ లో సీరియల్ ముగింపును డీల్ చేసిన విధానం హృద్యంగా ఉంది. ఇక “ప్రవీణ్ కండ్రేగుల సినిమాటిక్ యూనివర్స్” (PKC)ని పరిచయం చేస్తూ “సినిమా బండి” బృందాన్ని కథలో కుదించిన విధానం కచ్చితంగా ఆకట్టుకుంటుంది. ఓవరాల్ గా దర్శకుడిగా రెండో సినిమాతోనూ మంచి విజయాన్ని అందుకున్నాడు ప్రవీణ్.
విశ్లేషణ: అందరూ కనెక్ట్ అయ్యే కథను, అందరికీ నచ్చేలా నడిపించడం అంత ఈజీ కాదు. “శుభం” అలాంటి కథే. ఇంట్లోని ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా ఓటీటీల ప్రభంజనం ముందువరకు సీరియల్స్ కు అతుక్కుపోయిన ప్రతి ఒక్కరూ గట్టిగా రిలేట్ అయ్యే కథ ఇది. ఈ కథను 125 నిమిషాల్లో ముగించడం అనేది చిత్రబృందం తీసుకున్న మంచి నిర్ణయం. అయితే.. కథనం విషయంలో మాత్రం కాస్త తడబడ్డారు. కొన్ని చోట్ల సాగదీసిన భావన కలుగుతుంది. అయితే.. ట్రీట్మెంట్ మాత్రం కచ్చితంగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుత తరం జెన్ జీ ఆడియన్స్ ఈ సినిమాకి కనెక్ట్ అవ్వడం అనేది కాస్త కష్టమే. మొత్తానికి సమంత తన తొలి ప్రయత్నంలో మంచి విజయాన్ని అందుకోగా.. దర్శకుడు ప్రవీణ్ సెకండ్ సినిమా సిండ్రోమ్ నుంచి విజయవంతంగా తప్పించుకున్నాడు. సందర్భాలను సాగదీయకుండా సన్నివేశాలు ఇంకాస్త ఎక్కువ రాసుకుని ఉంటే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది. ఆ చిన్నపాటి మైనస్ పాయింట్స్ ను పక్కనపెడితే.. “శుభం” ఎలాంటి మెసేజులు ఇవ్వకుండా రెండుగంటలపాటు చక్కగా నవ్విస్తుంది.
ఫోకస్ పాయింట్: శుభం భూయాత్ సమంత!
రేటింగ్: 2.5/5