దర్శకుడిగా ఓ వెలుగు వెలుగుతున్న సమయంలోనే నిర్మాతగా మారి అక్కడా వరుస విజయాలు అందుకుంటున్న సుకుమార్. ఈ లెక్కల మాస్టారి లెక్క ఎలా ఉంటుందో చెప్పాలి అంటే ఈ మాత్రం సరిపోతుంది అనుకుంటున్నాం. ఎక్కడ, ఎలాంటి కథ ఉంది.. దానిని ఎలా తెరకెక్కించాలి అనే విషయంలో ఆయనకు మంచి పట్టు ఉంది. అలాంటి మాస్టార్ నుండి వారసురాలు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. అక్కడ కూడా ఆయన మార్కు కనిపిస్తోంది. సుకుమార్ కుమార్తె సుకృతి వేణి ప్రధాన పాత్రలో ‘గాంధీ తాత చెట్టు’ అనే సినిమా తెరకెక్కింంది.
తబితా సుకుమార్ సమర్పకురాలిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను పద్మావతి మల్లాది తెరకెక్కించారు. ఎప్పటిలాగే ఈ సినిమాలో మైత్రీ మూవీ మేకర్స్ భాగస్వామిగా ఉంది. సుకుమార్ (Sukumar) రీసెంట్ సినిమాలన్నీ ఈ కాంబినేషన్‌లో సాగుతున్నవే అనే విషయం తెలిసిందే. ఇక విడుదల విషయం చూస్తే.. ఈ నెల 24న విడుదల చేస్తున్నారు. మహాత్మ గాంధీ ఆదర్శాలను పాటిస్తూ ఓ పదమూడేళ్ల అమ్మాయి తను పుట్టిన ఊరి కోసం ఏం చేసింది అనే అంశం చుట్టూ ఈ సినిమా నడుస్తుంది.
‘గాంధీ తాత చెట్టు’ చిత్రాన్ని ఇప్పటికే వివిధ అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించారు. అక్కడ అవార్డులు, రివార్డులు కూడా వచ్చాయి. సుకృతి వేణి ఉత్తమ బాల నటిగా పురస్కారాల్ని కూడా సొంతం చేసుకొంది. సమాజాన్ని సోషల్ మీడియా ఎలా నాశనం చేస్తోంది. ఈ ఇబ్బందుల నుండి ఎలా బయటపడాలి తదితర అంశాలు కూడా ఈ సినిమాలో ప్రస్తావించారు అని చెబుతున్నారు. విదేశాల్లో అవార్డులు అందుకున్న ఈ సినిమా తెలుగునాట ఎలాంటి ఆదరణ పొందుతుందో చూడాలి.
తెలుగు రాష్ట్రాల్లో బాగా ప్రచారం చేసి సినిమాను రిలీజ్ చేయబోతున్నారట. సంక్రాంతి తర్వాతే ఈ ప్రచారం ఉంటుందట. మరి తండ్రికి తగ్గ కూతురిగా సుకృతి వేణి ఈ సినిమాతో నిరూపించుకుంటుందా అనేది చూడాలి. ప్రయోగాత్మక జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమా విజయం సాధిస్తే మన దగ్గర కూడా ఇలాంటి సినిమాలు మరిన్ని వస్తాయి.