సుప్రీమ్

  • May 5, 2016 / 10:22 AM IST

మెగా మేనల్లుడు సాయిధరమ్ నటించిన తాజా చిత్రం “సుప్రీమ్”. “పటాస్” ఫేం అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించాడు. సాయిధరమ్ సరసన రాశీఖన్నా కథానాయికగా నటించిన ఈ చిత్రం నేడు (మే 5) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి “సుప్రీమ్”తో మెగా హీరో సాయిధరమ్ తేజ్ మరో హిట్ ను అందుకొన్నాడో లేదో తెలియాలంటే మా సమీక్షను చదవాల్సిందే.

కథ : “ఆంధ్రప్రదేశ్” లోని ఒక భూమి తగాదా తీర్చడం కోసం “అమెరికా” నుంచి వచ్చిన ఓ కుర్రాడు.. తెలంగాణా (హైదరాబాద్)లో ట్యాక్సీ నడుపుకొనే హీరో చెంతన చేరి.. తన ఆశయ సాధన కోసం పాటు పడుతుంటాడు. ఇంతలో ఒరిస్సాకు చెందిన ఒక విలన్ గ్యాంగ్ ఆ కుర్రాడ్ని కిడ్నాప్ చేస్తుంది. ఈ సకల రాష్ట్ర సమ్మేళనంతో జరిగిన రాద్ధాంతం ఏమిటి?

ఆంధ్రాలోని భూమి తగాదాను తుదముట్టించాలన్న అమెరికా కుర్రాడి ఆశ నెరవేరిందా? లేదా? అందుకు తెలంగాణ హీరో ఏ విధంగా సహాయపడ్డాడు? అనేది క్లుప్తంగా “సుప్రీమ్” సినిమా కథ. మరి తెలంగాణా హీరో బాలు పాత్రలో సాయిధరమ్ తేజ్.. అమెరికా కుర్రాడిగా మైఖేల్ గాంధీ, ఒరిస్సా విలన్ గా రవికిషన్ లు ఎలా ఆకట్టుకొన్నారో చూద్దాం. మర్చిపోయాను.. సినిమాలో హీరోయిన్ కూడా ఉందండోయ్. ఆ అమ్మాయి పేరు బెల్లం శ్రీదేవి (రాశిఖన్నా). ఈ అమ్మడికి ఏ రాష్ట్రమో తెలియదు కానీ.. సినిమాలో మాత్రం అప్పుడప్పుడూ మెరుస్తుంటుంది.

నటీనటుల పనితీరు : ట్యాక్సీ డ్రైవర్ గా సాయిధరమ్ తేజ్ మంచి ఎనర్జీతో నటించాడు. అయితే.. ఓపెనింగ్ సీక్వెన్స్ మినహా సినిమా మొత్తంలో అతడు ఒక్క సన్నివేశంలో కూడా ప్యాసింజర్ ను బ్యాక్ సీట్ కూర్చోబెట్టుకొన్నట్లు కనిపించడు. అడ్డదారిలో పోలీస్ ఉద్యోగం సంపాదించిన బెల్లం శ్రీదేవి పాత్రలో రాశిఖన్నా అందంగానే కనపడింది. రెండు పాటలు, ఒక కామెడీ సీన్ మినహా ఆమెకు నటించడానికి పెద్దగా స్కోప్ లేదు. ప్రధాన ప్రతినాయకుడైన కబీర్ సింగ్ ను కేవలం కాఫీ తాగడానికి, ఫోన్లు మాట్లాడానికి మాత్రమే పరిమితం చేసారు. అందువల్ల విక్రమ్ సర్కార్ పాత్రలో విలనిజం పండలేదు. ఆంగ్లో ఇండియన్ గా నటించిన బాలీవుడ్ కుర్రాడు మైఖేల్ గాంధీ ఈ సినిమాలో తన నటనతో, హావభావాలతో ఆకట్టుకొన్నాడు. సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. రాజేంద్రప్రసాద్, సాయికుమార్, రఘుబాబులు తమ తమ పాత్రల పరిధిమేరకు ఫర్వాలేదనిపించుకొన్నారు. 30 ఇయర్స్ పృధ్వి, ప్రభాస్ శ్రీనుల “జింగ్ జింగ్” కామెడీ సీన్లు బాగానే ఉన్నప్పటికీ.. అది ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కు మాత్రమే పరిమితం. ఇక.. “సన్నాయి మేళం” కాదు కాదు.. “బ్యాండ్ మేళం” బ్రదర్స్ గా పోసాని-శ్రీనివాసరెడ్డిలు కామెడీ చేద్దామని ప్రయత్నించి విఫలమయ్యారు.

సాంకేతికవర్గం పనితీరు : సాయికార్తీక్ స్వరపరిచిన బాణీలు బాగున్నాయి. పాటల ప్లేస్ మెంట్ కూడా బాగుంది. కానీ.. నేపధ్య సంగీతంతో మాత్రం అలరించలేకపోయాడు. సాయిశ్రీరామ్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. చేజ్ సీక్వేస్ బ్లాక్స్ బాగున్నాయి. ఫ్లై కామ్ లో చిత్రీకరించిన టాప్ యాంగిల్స్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి. వెంకట్ కంపోజ్ చేసిన ఫైట్స్ లో సహజత్వం అనేది ఎక్కడా కనిపించదు. దాదాపు అన్ని ఫైట్స్ లోనూ “స్క్రూ డ్రైవర్, రెంచీలను” వాడేయడం వలన ఆడియన్స్ బోర్ ఫీలవుతారు. క్లైమాక్స్ లో వచ్చే “హనుమాన్ దివ్యాంగశాల” ఫైట్ సీక్వెన్స్ ఆలోచన బాగున్నప్పటికీ.. ఆచరణ కుదరలేదు. ఎమోషనల్ గానూ కనెక్ట్ అవ్వదు. క్లాసికల్ సూపర్ హిట్ అయిన “అందం హిందోళం” రీమిక్స్ ను పాత పాటను చిత్రీకరించిన చోటే మళ్లీ షూట్ చేసినప్పటికీ.. ఆ ఓల్డ్ క్లాసిక్ ను మరిపించలేకపోయింది. చిరంజీవి స్థాయిలో కాకపోయినా సాయిధరమ్ తేజ్ ఓ మోస్తరుగా ఫర్వాలేదనిపించుకొన్నా.. రాశిఖన్నా మాత్రం డ్యాన్సుల విషయంలో రాధకు ఏమాత్రం సాటి రాలేకపోయింది.

రచన-దర్శకత్వం : దర్శకుడు అనిల్ రావిపూడి తన మునుపటి చిత్రమైన “పటాస్”కు రాసుకొన్నట్లుగానే.. “సుప్రీమ్” సినిమాకు కూడా చాలా రొటీన్ కథను రాసుకొన్నాడు. ఆ రొటీన్ కథకు కాస్తంత హాస్యాన్ని, ఇంకొంచెం యాక్షన్ ను కలగలిపి “సుప్రీమ్” సినిమాను తీర్చిదిద్దాడు. సుప్రీమ్ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా అందిచండంలో అనిల్ రావిపూడి  సక్సెస్ అయ్యాడు.

“గుండెకు మంచి ఎక్సర్ సైజ్ 10 కిలోమీటర్లు నడవడం కాదు.. పది మందికి సాయపడడం” లాంటి సంభాషణలు సహజంగా ఉన్నాయి. అయితే.. మాస్ ఆడియన్స్ కు కావాల్సిన పంచ్ లు మిస్ అయ్యాయి. ఒకప్పుడు మూడునాలుగు కంపెనీలకు ఓనరైన తన తండ్రిని.. అతని కొడుకు ఒక ఏటిఎమ్ మిషిన్ దగ్గర గార్డ్ గా చూసి.. “నా తండ్రిని ఇలాగే చూడాలనుకొన్నాను” అనడం, అమెరికాలో కోటీశ్వరుడైన కుర్రాడు.. ఇండియాలో డబ్బుల్లేక నీళ్లు తాగి పడుకోవడం, సినిమా ఓపెనింగ్ మరియు క్లైమాక్స్ ఎపిసోడ్స్ లాజికల్ గానే కాకుండా ఎమోషనల్ గానూ కనక్ట్ అవ్వవు. మొత్తానికి..
లాజిక్కులు, నటీనటుల క్యారెక్టర్లలో క్లారిటీలు పట్టించుకోకుండా.. టైమ్ పాస్ కోసం “సుప్రీమ్” సినిమాను చూడవచ్చు!

రేటింగ్ : 3/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus