టాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా ఆసక్తి రేపుతున్న తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల హడావిడి ముగిసింది. ఎట్టకేలకు ఫలితాలు వచ్చేశాయి. ఈ ఎన్నికల్లో సీనియర్ నిర్మాత సురేష్ బాబు దగ్గుబాటి ఘన విజయం సాధించారు. ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా ఆయన ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన పోలింగ్ లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ తరఫున పోటీ చేసిన ఆయనకు సభ్యులు పట్టం కట్టారు.
ఈసారి ఎన్నికల్లో పోటీ రసవత్తరంగా సాగింది. చిన్న నిర్మాతలు ‘మన ప్యానల్’ పేరుతో బరిలోకి దిగితే, పెద్ద నిర్మాతలు ‘ప్రోగ్రెసివ్ ప్యానెల్’ గా ఏర్పడి పోటీ పడ్డారు. హోరాహోరీగా సాగుతుందనుకున్న ఈ పోరులో చివరకు ప్రోగ్రెసివ్ ప్యానెల్ తన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మెజారిటీ సభ్యులు పెద్ద నిర్మాతల వైపే మొగ్గు చూపారు.
ఫలితాల విషయానికి వస్తే మొత్తం 48 మంది కార్యవర్గ సభ్యుల కోసం ఈ ఎన్నికలు జరిగాయి. ఇందులో సురేష్ బాబు నేతృత్వంలోని ప్రోగ్రెసివ్ ప్యానెల్ ఏకంగా 31 స్థానాలను కైవసం చేసుకుంది. ప్రత్యర్థి వర్గమైన మన ప్యానెల్ కేవలం 17 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో ఛాంబర్ లో మరోసారి ప్రోగ్రెసివ్ ప్యానెల్ హవా నడిచిందనే చెప్పాలి.
కీలక పదవులన్నీ సురేష్ బాబు ప్యానెల్ కే దక్కాయి. కార్యదర్శిగా కొల్లా అశోక్ కుమార్ ఎన్నికవగా, ఉపాధ్యక్షులుగా యంగ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ, భరత్ చౌదరి విజయం సాధించారు. కోశాధికారిగా ముత్యాల రామదాసులు గెలుపొందారు. జాయింట్ సెక్రటరీలుగా మోహన్ వడ్లపట్ల, విజయేందర్ రెడ్డి ఎన్నికయ్యారు.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో మొత్తం 3,355 మంది సభ్యులు ఓటు హక్కు కలిగి ఉన్నారు. అధ్యక్ష, కార్యదర్శులతో పాటు 12 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా ఉంటారు. ఈ ఎన్నికల్లో గెలిచిన కొత్త కార్యవర్గం వచ్చే రెండేళ్ల పాటు, అంటే 2027 వరకు పదవిలో కొనసాగుతుంది.