కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) ప్రస్తుతం తన స్పీడుతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నవంబర్ 14న పాన్ వరల్డ్ రేంజ్ లో విడుదలవుతున్న ‘కంగువా’ (Kanguva) మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శివ (Siva) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ చిత్రం పీరియాడికల్ యాక్షన్ జోనర్ లో ఉండడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సూర్య దేశవ్యాప్తంగా ‘కంగువా’ ప్రమోషన్స్‌లో పాల్గొంటూ అన్ని రాష్ట్రాల్లో సందడి చేస్తున్నారు. సూర్యకు ‘సూరరై పొట్రు’, ‘జై భీమ్’ సినిమాలతో నేషనల్ వైడ్ ఇమేజ్ ఏర్పడింది.
ఈ సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలై విపరీతమైన ఆదరణ పొందడంతో పాటు నేషనల్ అవార్డులు సైతం సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు ‘కంగువా’తో సూర్య మరోసారి పాన్ ఇండియా మార్కెట్ లో అదరగొట్టాలని చూస్తున్నారు. ఈ చిత్రం 1000 కోట్ల కలెక్షన్స్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు ఆశిస్తున్నాయి. ‘కంగువా’ తర్వాత సూర్య మరో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
సూర్య కార్తీక్ సుబ్బరాజు (Karthik Subbaraj) దర్శకత్వంలో మరో యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతో సినిమా పూర్తి చేశారు. ఈ చిత్రాన్ని 2025 మార్చిలో విడుదల చేయాలని నిర్ణయించారు. కార్తీక్ సుబ్బరాజు కూడా కోలీవుడ్ లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు కలిగిన దర్శకుడు కావడంతో ఈ సినిమాపైనా హైప్ క్రియేట్ అయింది. ఇంకా సూర్య నటుడు, దర్శకుడు ఆర్ జే బాలాజీతో (RJ Balaji) కలిసి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ చేయబోతున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది.
2025 ద్వితీయార్ధంలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. 12 నెలల వ్యవధిలోనే మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం సూర్య స్పీడుని తెలియజేస్తోంది. ‘కంగువా’ భారీ విజయం సాధిస్తే, సూర్య తర్వాతి సినిమాల బిజినెస్ మరింతగా పెరగనున్నట్లు అనిపిస్తోంది. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకోవడమే కాకుండా పాన్ ఇండియా లెవెల్ లో సూర్య తన సత్తా చాటాలని భావిస్తున్నారు.