Suzhal Review: సుడల్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

విజయ్ సేతుపతి – మాధవన్ టైటిల్ పాత్రల్లో తెరకెక్కించిన “విక్రమ్ వేద” సినిమా గురించి తెలియనివారుండరు. ఆ చిత్ర దర్శకద్వయం పుష్కర్ & గాయత్రి రచించి-నిర్మించిన వెబ్ సిరీస్ “సుడల్” (సుడిగుండాలు). ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ 8 ఎపిసోడ్ల వెబ్ సిరీస్ అమేజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది. ఈ సిరీస్ ఆడియన్స్ ను ఏమేరకు ఎంగేజ్ చేసిందో చూద్దాం..!!

కథ: తమిళనాడు రాష్ట్రంలోని ఓ చిన్న గ్రామంలోని ఓ పెద్ద ఫ్యాక్టరీ అగ్ని ప్రమాదంలో నాశనం అవుతుంది. ఆ కేస్ ఇన్వెస్టిగేట్ చేస్తున్న పోలీసులకు.. అదే రోజు రాత్రి, ఆ గ్రామానికి చెందిన నీల అనే అమ్మాయి కనిపించకుండాపోతుంది. నీల మిస్సింగ్ కేస్ & ఫ్యాక్టరీ ఫైర్ కేసులను లోకల్ పోలీసులు రెజీనా (శ్రేయా రెడ్డి), చక్రవర్తి (కధిర్)లకు కొన్ని నమ్మలేని నిజాలు తెలుస్తాయి.

అసలు నీలా కనిపించకుండాపోవడానికి, ఫ్యాక్టరీలో మంటలు అంటుకోవడానికి సంబంధం ఏమిటి? అసలు నీలాను కిడ్నాప్ చేసింది ఎవరు? నీలా ఏమైంది? వంటి ప్రశ్నలకు సమాధానమే “సుడల్” సిరీస్.

 

నటీనటుల పనితీరు: పోలీస్ ఆఫీసర్ గా, తల్లిగా శ్రేయా రెడ్డి అందరి కంటే ఎక్కువగా ఆకట్టుకుంది. పార్తిబన్ లాంటి సీనియర్ నటులున్నప్పటికీ.. కధిర్, ఐశ్వర్య రాజేష్ తదితరులు తమ తమ పాత్రల్లో మెరిశారు.

సాంకేతికవర్గం పనితీరు: ముందుగా పుష్కర్ & గాయత్రిల రాతను మెచ్చుకోవాలి. హాలీవుడ్ సిరీస్ ల రేంజ్ లో కథ-కథనాన్ని రాసుకున్నారు. ఒక సాధారణ కథలో కమర్షియల్ అంశాలతోపాటు.. సమాజంలో జరుగుతున్న కొన్ని హేయమైన విషయాలను కూడా జొప్పించి ఆలోచింపజేసిన విధానం బాగుంది. ఓ ఫ్యాక్టరీ గొడవగా మొదలైన సిరీస్.. అక్కడ్నుంచి కిడ్నాపింగ్ కేస్ గా మారి, తదుపరి మర్డర్ మిస్టరీగా పరిపక్వత చెందిన తీరు ప్రేక్షకుల్ని అబ్బురపరుస్తుంది.

 

ఆ మర్డర్ మిస్టరీ వెనుక కూడా లెక్కలేనన్ని ట్విస్టులతో రంజింపజేశారు. ఈ కథ-కథనాన్ని ఓన్ చేసుకున్న దర్శకద్వయం అనుచరణ్-బ్రమ్మలు ఎలాంటి అనవసరమైన డీవెయేషన్స్ లేకుండా సిరీస్ ను ఆడియన్స్ కు ప్రెజంట్ చేసిన విధానం 8వ ఎపిసోడ్ ఎండింగ్ వరకూ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయడమే కాదు.. ముగించిన విధానం కూడా బాగుంది.

డార్క్ థీమ్ లో షూట్ చేసిన ఎపిసోడ్స్ అండ్ అమ్మవారిని మూలకథలో భాగంగా చూపిన ఆర్ట్ వర్క్ & ప్రొడక్షన్ డిజైన్ ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి.

సామ్ సి.ఎస్ నేపధ్య సంగీతం సిరీస్ కి మెయిన్ హైలైట్. సన్నివేశంలోని ఇంటెన్సిటీ & ఎమోషన్ ను ఎలివేట్ చేసిన విధానం ఆడియన్స్ ను సిరీస్ లోకి ఎంగేజ్ చేస్తుంది.

విశ్లేషణ: రొటీన్ థ్రిల్లర్స్ కు భిన్నంగా.. ప్రేక్షకుల్ని కట్టిపడేసే ట్విస్టులతో, సామాజిక రుగ్మతులతో, నేటితరం ప్రేక్షకులు, పేరంట్స్ తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలను ఎక్కడా ఇబ్బందిపెట్టకుండా, ఆలోచింపజేసేలా చేసే సిరీస్ “సుడల్”.

రేటింగ్: 3/5

Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus