టాలీవుడ్‌లో 17 ఏళ్ళ క్రితం మంచి క్రేజ్ సంపాదించిన నటి కలర్స్ స్వాతి (Swati Reddy) కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. మలయాళ చిత్రాల్లోనూ మంచి విజయాలు అందుకున్నా, తెలుగులో ఆమెకు కొత్త అవకాశాలు రావడం తగ్గిపోయింది. అయితే, ఇప్పుడు ఆమె ఓ భారీ పాన్ ఇండియా సినిమాలో నటించబోతుందనే వార్త ఫిల్మ్ నగర్‌లో హల్‌చల్ చేస్తోంది. యంగ్ హీరో నిఖిల్ (Nikhil Siddharth) ప్రధాన పాత్రలో రూపొందుతున్న స్వయంభు (Swayambhu) సినిమాలో స్వాతికి ఓ కీలక పాత్ర దక్కిందట.
చోళ సామ్రాజ్య నేపథ్యంలో రూపొందుతున్న ఈ హిస్టారికల్ వార్ డ్రామాలో, నిఖిల్ ఓ యోధుడిగా కనిపించనున్నాడు. ఇప్పటికే భారీ సెట్లలో నిర్మించిన ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని యుద్ధ సన్నివేశాలను షూట్ చేశారు. ఇక ఇందులో కీలకమైన ఓ మహిళా పాత్రకు మొదట కొత్త నటిని తీసుకోవాలని అనుకున్నా, చివరికి స్వాతిని ఎంపిక చేసినట్లు సమాచారం. స్వాతి ఎంపిక వెనుక నిఖిల్ హస్తం ఉందనే వార్త కూడా వినిపిస్తోంది.
నిఖిల్, స్వాతి కలిసి కార్తికేయ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి స్నేహం కొనసాగుతోంది. ఇప్పుడు స్వయంభులో స్వాతికి అవకాశం రావడంలో నిఖిల్ ప్రభావం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఆమె పాత్ర కథలో ఎంత ప్రాధాన్యత కలిగి ఉందనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. గత రెండు సంవత్సరాలుగా స్వాతి పెద్దగా సినిమాలు చేయలేదు. ఓటీటీ ప్రాజెక్టులు, వెబ్ సిరీస్‌లు చేస్తుందనే టాక్ వచ్చినా, పెద్దగా ఆఫర్లు రాలేదు.
ఇప్పుడు స్వయంభులో మళ్లీ వెండితెరపై కనిపిస్తే, ఆమెకు మళ్లీ టాలీవుడ్‌లో మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. నిఖిల్ సరసన నభా నటేష్ (Nabha Natesh), సంయుక్తా మీనన్ (Samyuktha Menon)హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో, స్వాతి పాత్ర ఓ ప్రత్యేకమైన ఎమోషనల్ ఎలిమెంట్‌ను అందించబోతుందని టాక్. ప్రస్తుతం స్వయంభు షూటింగ్ ముగింపు దశలో ఉంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాలో స్వాతి పాత్రకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.