‘నన్ను అంటున్నారు.. నన్నే అంటున్నారు.. నేనేం చేశాను.. నా తప్పేంటి’ గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో ఇలాంటి డైలాగ్‌లు తెగ వినిపిస్తున్నాయి. టాలీవుడ్‌లో అంటే తెలుగు సినిమాల్లో కాదు. తెలుగు సినిమా ప్రచారాల్లో. హీరోలు, నిర్మాతలు, దర్శకులు, నటులు.. ఇలా అందరూ ఈ సింపతీ కార్డును తెగ వాడేస్తున్నారు. ఏమన్నా అంటే మేం మాటలు పడుతున్నది నిజమే కదా, మమ్మల్ని అంటోంది నిజమే కదా అంటున్నారు. దీంతో టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్ పుట్టుకొచ్చింది.. అంటూ అభిమానులు, ప్రేక్షకులు కిస్ కిస్ మంటూ నవ్వేస్తున్నారు.
కావాలంటే మీరే చూడండి.. ‘ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చకపోతే చెప్పుతో కొట్టుకుంటా’ అని ఓ దర్శకుడు అంటే.. మమ్మల్ని తొక్కేస్తున్నారు అని మరొక ప్రామిసింగ్ హీరో అంటున్నారు. మరొక హీరో అయితే గతేడాది ప్రారంభంలో పెద్ద హీరోలతో పోటీ పడి ఈ సింపతీ కార్డు ఉపయోగించి భారీ విజయమే అందుకున్నారు. సినిమా విజయానికి అప్పటి విక్టిమ్ కార్డు బాగానే పని చేసింది అని టాలీవుడ్‌లో ఓ గుసగుస. అంటే అప్పుడు పెద్ద సినిమా కోసం మా సినిమాను పక్కకు తప్పుకోమన్నారు అని ఆ హీరో, ప్రొడ్యూసర్ అన్నారులెండి.
మొన్నీమధ్య ప్రామిసింగ్ యంగ్ హీరో మా సినిమాకు థియేటర్లు ఇవ్వకుండా, పక్క రాష్ట్రం నుండి వచ్చిన సినిమాకు ఇస్తున్నారు అంటూ తాము బాధితులం అనేలా చెప్పుకొచ్చారు. మరో హీరో అయితే గతకొన్ని సినిమాలుగా ‘తనను తొక్కేస్తున్నారని.. దేవుడి దయ ఉంటే అంతెత్తున కూర్చుంటా’ అని ఓ రకం విక్టిమ్ కార్డు వాడారు. అయితే ఆయనకు అది కలసి రావడం లేదు. ఇక నటీమణులు, హీరోయిన్లు కొందరైతే ఎప్పటి నుండో ఈ కార్డు వాడుతున్నా.. ఈ మధ్య ఎందుకో తగ్గింది.
ఓ స్టార్ దర్శకుడు అయితే తన పనిని తాను చేయనివ్వకుండా హీరో మధ్యలో దూరి ఇబ్బంది పెట్టారు అని ఓపెన్‌గానే కామెంట్ చేశారు. అయితే ఆ దర్శకుడు ఆ తర్వాత తీసిన సినిమాలో లూప్‌హోల్స్‌ను బయట పెట్టి ఆ ‘చేయనివ్వని’ హీరో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రిప్లై ఇచ్చారు. దీంతో అప్పుడు, ఇప్పుడూ ఆ దర్శకుడే సింపతీ కార్డు వాడేస్తున్నారు అనే మాటలూ విన్నాయి. ఏదేమైనా సింపతీ కార్డు.. ఇప్పుడు టాలీవుడ్ ట్రంప్ కార్డుగా మారింది.