కలలు కంటున్న తాప్సి..!!

“ఉట్టి ఎక్కలేనమ్మా స్వర్గానికి నిచ్చెన వేసిందట…” అని నటి తాప్సి గురించి ఫిల్మ్ నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి ఐదేళ్లు అవుతున్నా ఈ భామ ఖాతాలో సరైన హిట్ పడలేదు. అడపాదడపా తమిళం, మలయాళం సినిమాల్లో కనిపించినా మంచి పేరు తెచ్చుకోలేక పోయింది. గతఏడాది ఆమె నటించిన కాంచన-2 విజయం సాధించినా.. ఆ హిట్ నిత్యామీనన్ జాబితాలో చేరిపోయింది.

ఎందుకంటే నిత్యా నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. కాంచన 2 అంటే నిత్యనే గుర్తుకొస్తోంది. దీంతో బాధపడ్డ  సొట్టబుగ్గల సొగసరి బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. ఈ సారి ఎలాగైనా టాప్ హీరోయిన్  గా పేరు తెచ్చుకోవాలని కష్టపడుతోంది. ఆమె నటించిన రన్నింగ్ షాదీ డాట్ కామ్ త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ఫలితం తేలక ముందే తాప్సి అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించే అవకాశం పట్టేసింది. పింక్ సినిమాలో బిగ్ బి తో స్క్రీన్ పంచుకోనుంది.

దీంతో సంబర పడిపోతూ “మూడు భాషల్లో నటిస్తున్న హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నాను. అయితే, టాప్ స్టార్ రేంజికి మాత్రం ఎదగలేకపోయాను. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది.  ప్రస్తుతం హిందీలో అమితాబ్ బచ్చన్ తో సినిమా చేస్తున్నాను. దీంతో బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అన్న పేరు తెచ్చుకుంటానన్న నమ్మకం ఉంది” అని  చెప్పింది. ఈ మాటలకు సినీ విమర్శకులు నవ్వుకుంటున్నారు. తాప్సి కలలు కంటోందని చెబుతున్నారు. తక్కువ పోటీ ఉండే టాలీ వుడ్ లోనే నెగ్గుకు రాలేక పోయిన ఈ భామ బాలీవుడ్లో సత్తా చాటుతాను అనడం హాస్యాస్పదంగా ఉందని వెల్లడించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus