Takita Tadimi Tandana Review in Telugu: తకిట తదిమి తందానా సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • ఘన ఆదిత్య (Hero)
  • ప్రియ కొమ్మినేని (Heroine)
  • . (Cast)
  • రాజ్ లోహిత్ (Director)
  • చందన్ కొప్పుల (Producer)
  • నరేన్ (Music)
  • పి.ఎన్.అర్జున్ (Cinematography)
  • Release Date : ఫిబ్రవరి 27, 2025

కొన్ని సినిమాలు ప్రమోషనల్ కంటెంట్ తో భలే ఆకట్టుకుంటాయి. ఆ విధంగా అలరించిన చిన్న సినిమా “తకిట తదిమి తందానా”. నవతరం యువత ఎదుర్కొంటున్న సమస్యల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంతో రాజ్ లోహిత్ దర్శకుడిగా పరిచయమవ్వగా.. చందన్ కొప్పుల ఈ చిత్రాన్ని నిర్మించారు. మరి ఈ చిన్న సినిమా ప్రేక్షకుల్ని కంటెంట్ తో ఏమేరకు ఆకట్టుకుంది అనేది చూద్దాం..!!

Takita Tadimi Tandana Review

కథ: ఆదిత్య (ఘన ఆదిత్య) ఫేక్ ఎక్స్ పీరియన్స్ తో పెద్ద ఉద్యోగం సంపాదించి వచ్చే జీతానికి మించిన ఖర్చులతో జల్సాలు చేస్తుంటాడు. పెళ్లి చేసుకొని సెటిల్ అవుదామనుకునే టైమ్ కి ఉద్యోగం ఊడిపోతుంది, దాంతో ఉన్న క్రెడిట్ కార్డులన్నీ గీకి మరీ పెళ్లి చేసుకుంటాడు. చాన్నాళ్ళపాటు ఉద్యోగం రాక ఫ్రెండ్స్ రూమ్ లో కూర్చుని ఉద్యోగం కోసం వేట కొనసాగిస్తుంటాడు. ఈ క్రమంలో కంగారులో తీసుకున్న లోన్ యాప్ నుండి బెదిరింపు కాల్స్ కూడా మొదలవుతాయి. ఏం చేయాలో తోచని స్థితిలో ఆదిత్య ఏం చేశాడు? అతడు తీసుకున్న నిర్ణయం అతడి జీవితాన్ని ఎలా మార్చింది? అనేది “తకిట తదిమి తందానా” కథాంశం.

నటీనటుల పనితీరు: ఘన ఆదిత్య నటుడిగా మంచి హావభావాలతో ఆకట్టుకున్నాడు. మంచి స్క్రీన్ ప్రెజన్స్ ఉంది, మంచి పాత్రలు ఎంచుకోగలిగితే నటుడిగా మంచి స్థాయికి చేరుకోగలడు.

ప్రియ కొమ్మినేని భావ ప్రకటనలో కాస్త తడబడుతుంది కానీ.. స్క్రీన్ ప్రెజన్స్ తో పర్వాలేదు అనిపించుకుంది. స్నేహితుల పాత్రల్లో కనిపించినవారు అలరించారు. మిగతా ఆర్టిస్టులందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు పర్వాలేదనిపించుకున్నారు.

సాంకేతికవర్గం పనితీరు: నరేన్ సమకూర్చిన పాటలు బాగున్నాయి. టైటిల్ ట్రాక్, లవ్ సాంగ్ సాహిత్య పరంగానూ బాగుంది. అయితే.. నేపథ్య సంగీతంతో మాత్రం అలరించలేకపోయాడు. అర్జున్ సినిమాటోగ్రఫీ వర్క్ సోసోగా ఉంది. నేచురల్ లైట్ లో షూట్ చేయడం మంచిదే కానీ కనీసం డి.ఐ & కలరింగ్ చేయించి ఉంటే బాగుండేది. ఆ రెండూ సరిగా లేకపోవడంతో, సినిమా చాలా డల్ గా ఉంటుంది. బడ్జెట్ లో పరిమితుల వల్ల కూడా ఇలా అయ్యి ఉండొచ్చు.

దర్శకుడు రాజ్ లోహిత్ రాసుకున్న పాయింట్ బాగుంది. తెరకెక్కించిన విధానం కూడా ఆకట్టుకునే స్థాయిలోనే ఉంది. అయితే.. కంటెంట్ కి క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని కాస్త సీరియస్ గా తీసుకొని ఉంటే బాగుండేది. ఆదిత్య పాత్రకు ప్రస్తుత తరం యువత అందరూ కచ్చితంగా రిలేట్ అవుతారు. ముఖ్యంగా.. ఫాల్స్ ప్రెస్టీజ్ కోసం ఆరాటపడే చాలామందికి ఈ చిత్రం ఓ కనువిప్పు. దర్శకుడిగా, కథకుడిగా మంచి మార్కులే సంపాదించుకున్నాడు. బడ్జెట్ కాస్త సహకరించి ఉంటే ఇంకాస్త బెటర్ అవుట్ పుట్ అందించి ఉండేవాడు.

విశ్లేషణ: ఒక్కోసారి కథలో నిజాయితీ మాత్రమే సరిపోదు, రెండు గంటలపాటు ప్రేక్షకుల్ని థియేటర్లో కదలనివ్వకుండా కూర్చోబెట్టగలిగే ఆసక్తికరమైన అంశాలు కూడా ఉండాలి. “తకిట తదిమి తందానా” పాయింట్ గా మంచిదే, కానీ ఆ పాయింట్ ను ఎలివేట్ చేసే స్థాయి డ్రామా వర్కవుట్ అవ్వలేదు. ఆదిత్య క్యారెక్టర్ ఆర్క్ ను ఎక్స్ ప్లోర్ చేసినట్లుగా, హీరోయిన్ క్యారెక్టర్ ఆర్క్ ను వినియోగించుకోలేదు. అలాగే.. అప్పుల ఊబి నుంచి బయటపడడానికి భార్యభర్తలు కలిసి ఏం చేశారు అనేది కూడా చూపించలేదు. ఈ అంశాలన్నీ సినిమాలో చూపించి ఉండుంటే.. సంతృప్తి ఉండేది. వీటన్నిటికీ తోడు సినిమా క్వాలిటీ కూడా సోసోగా ఉండడం అనేది మైనస్ గా మారింది.

ఫోకస్ పాయింట్: ప్రయత్నం మంచిదే కానీ.. క్వాలిటీ కూడా ఉంటే బాగుండేది!

రేటింగ్: 2/5

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus