పండగలొస్తున్నాయంటే మనుషులు తమ బంధువుల ఇంటికి వెళ్లినా వెళ్లకపోయినా.. సినిమాలు మాత్రం థియేటర్లకు వెళ్లడం మానవు. ఆ రకంగా మన దర్శక నిర్మాతలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ పండగ సినిమా అంటూ ప్రచారం కూడా మొదలెడతారు. అయితే దీపావళి పండగకి మాత్రం తెలుగు చిత్ర పరిశ్రమ గొడ్డుబోయిందన్నట్టుగా మొదటి ఆటకే సినిమా ఎత్తేసే ఓ రెండు సినిమాలను విడుదల చేస్తున్నారు.అందులో ఒకటి వరుణ్ సందేశ్ నటించిన మిస్టర్ 420 కాగా రెండోది ‘ముకుంద’ సినిమాలో వరుణ్ తేజ్ స్నేహితుడిగా నటించిన శైలేష్ బొలిశెట్టి తొలిసారిగా హీరోగా నటించిన ‘ఛల్ ఛల్ గుఱ్ఱం’.
కెరీర్ తొలినాళ్లలో వచ్చిన రెండు హిట్స్ తప్పితే మరో హిట్ పడని వరుణ్ సందేశ్, శైలేష్ ఈ దీపావళికి ఎలాంటి బాక్సాఫీస్ వద్ద కాకరొత్తులు మాదిరి కాసేపు కూడా వెలుగు పంచలేవన్నది అందరికీ తెలిసిన విషయమే. మరోవైపు అనువాద సినిమాలతోనే స్ట్రెయిట్ హీరోల్లా తెలుగులో మార్కెట్ ఏర్పరుచుకున్న తమిళ హీరోలు నటించిన ఓ రెండు సినిమాలు ఈ అదేరోజున (అక్టోబర్ 28న) విడుదలవుతున్నాయి. ఈ దీపావళికి ధనుష్ – ధర్మయోగిగా రానుండగా, కార్తీ – కాష్మోరా గా ప్రేక్షకులకు కిక్కివ్వనున్నాడు. ధనుష్ తొలిసారి ద్విపాత్రాభినయం చేయడం, మూడు విభిన్న పాత్రల్లో కార్తీ నటించడం వంటి కారణాలతో ఈ రెండు సినిమాలపై అంచనాలు నెలకొన్నాయి. ఆ లెక్కన ఈ దీపావళి కార్తీ, ధనుష్ లదే మరి..!