కొత్తవారితో సినిమాలు తీసి విజయాలు అందుకున్న ఘనత దాసరి నారాయణరావు తర్వాత తేజకే దక్కుతుంది. పోస్టర్ తోనే శివ సినిమాకి క్రేజ్ తెప్పించిన ఇతను డైరక్టర్ గా మారి తన సినిమాలకు బాగా క్రేజ్ తెచ్చేవారు. అలా చిత్రం, నువ్వు నేను, జయం వంటి గొప్ప విజయాలు అందుకున్నారు. గత కొన్నాళ్లుగా అతనితో విజయం దోబూచులాడింది. చివరకి నేనే రాజు నేనే మంత్రి తో పూర్వవైభవాన్ని సొంతంచేసుకున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ ని డైరక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నారు. బాలయ్యతో మనస్పర్థలు రావడంతో ప్రాజక్ట్ నుంచి తప్పుకున్నారు. నిన్ననే తేజ.. ఉదయ కిరణ్ పై బయోపిక్ తీస్తారని వార్త ఫిలిం నగర్లో చక్కర్లు కొట్టింది. ఈ రోజు ఆ విషయాన్నీ ఖరారు చేస్తూ మరో న్యూస్ వచ్చింది.
ఈ చిత్రానికి ఆసక్తికర టైటిల్ ని రిజిస్టర్ చేసినట్లు చెప్పుకుంటున్నారు. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్‌లో “కాబోయే అల్లుడు” అనే టైటిల్ రిజిస్టర్ చేసినట్లు తెలిసింది. దీంతో ఒక్కసారిగా ఈ బయోపిక్ పై అందరి దృష్టి మళ్లింది. ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా సినీ పరిశ్రమలోకి వచ్చి, పోటీని తట్టుకొని యూత్ హీరోగా ఉదయ్ కిరణ్ పేరుతెచ్చుకున్నారు. అమ్మాయిలందరూ ఉదయ్ కిరణ్ అంటే చాలా ఇష్టపడేవారు. మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సైతం ఉదయ్ ని ప్రేమించి నిశ్చితార్ధం చేసుకుంది. కానీ వారి ప్రేమ పెళ్లి వరకు చేరలేదు. దీని వెనుక అనేక రూమర్లు పుట్టుకొచ్చాయి. కానీ ఏది నిజమో తెలియదు. ఈ బయోపిక్ టైటిల్ చూస్తుంటే.. ఇందులో ఆ విషయాన్ని ప్రస్తావించనున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. తేజ తీరు చూస్తుంటే ఎన్టీఆర్ బయోపిక్ కి పోటీగానే “కాబోయే అల్లుడు” ని రంగంలో దింపేలాగా ఉన్నారు.