ఎన్టీఆర్ బయోపిక్ నుంచి తేజ బయటికి రావడం.. అదే సమయంలో సావిత్రి బయోపిక్ మహానటి హిట్ కావడం.. ఈ రెండు కారణాలు డైరక్టర్ తేజ్ ని ఉదయ కిరణ్ బయోపిక్ తీయడానికి ప్రేరేపించాయని రెండు రోజులుగా వార్తలు షికారుచేశాయి. నిన్న ఈ చిత్రానికి కాబోయే అల్లుడు అని పేరు కూడా రిజిస్టర్ చేయించినట్లు సోషల్ మీడియాలో వార్త హల్ చల్ చేసింది. దీంతో డైరక్టర్ తేజ్ స్పందించారు. ఇవన్నీ వట్టి పుకార్లేనని కొట్టిపడేశారు. అసలు ఉదయ కిరణ్ కి సంబంధించిన ఏ చిన్న స్క్రిప్ట్ కూడా తాను రాయడం లేదని, అటువంటి ఆలోచనలేదని స్పష్టం చేశారు. “ఉదయకిరణ్ బయోపిక్ నేను తీయడం లేదు.
ఇటువంటి వార్తలు ఎవరు పుట్టించారో నాకు తెలుసు. ఉదయ్ కిరణ్ మాత్రమే కాదు.. అటువంటి ఏ బయోపిక్ చేయడం లేదు” అని తేజ అన్నారు. మరి రానాతో సినిమాచేస్తున్న వార్తలపై కూడా క్లారిటీ ఇచ్చారు. “అవును. నేను రానాతో ఓ సినిమా చేయబోతున్నాను. ఆ పనుల్లోనే బిజీగా ఉన్నాను” అని వివరించారు. ఇది కూడా గత సినిమా “నేనే రాజు నేనే మంత్రి” తరహాలో ఉంటుందా? అని ప్రశ్నించగా.. “ఇది పొలిటికల్ సినిమా కాదు. పక్కా కమర్షియల్ సినిమా. యాక్షన్ ఎక్కువగా ఉంటుంది” అని వెల్లడించారు. ప్రస్తుతం రానా రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. అవి పూర్తి అయిన తర్వాత తేజతో సినిమా మొదలెట్టనున్నారు.