ఆంధ్రప్రదేశ్.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌గా విడిపోయిన కొన్ని రోజుల ముందు నుండి తెలుగు సినిమాకు ప్రోత్సాహకాలు లేవు. అంటే అవార్డులు, రివార్డులు లాంటివి ఇవ్వడం లేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల అధికారంలోకి వచ్చాక ‘గద్దర్’ పేరుతో అవార్డులు ఇస్తామని ప్రకటించారు. అయితే ఆ తర్వాత ఈ విషయంలో పెద్దగా స్పందన లేదు. ఆ మధ్య ప్రభుత్వం నుండి ‘ఎవరూ మా దగ్గరకు రాలేదు. వస్తే ఇచ్చేవాళ్లం’ అని అనడంతో చిరంజీవి (Chiranjeevi) స్పందించి పరిశ్రమ పెద్దలకు పిలుపునివ్వడంతో కదలిక వచ్చింది.
ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. ఎట్టకేలకు గద్దర్ అవార్డులకు (Gaddar Awards) ముహూర్తం పెట్టారు. ఈ ఉగాదికి గద్దర్ సినిమా అవార్డులను ప్రదానం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ మేరకు గద్దర్ సినిమా అవార్డుల కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం ఈ విషయాన్ని వెల్లడించారు. అవార్డుల ప్రదానోత్సవానికి ఏర్పాట్లు చేసుకోవాలని కమిటీకి ఆయన సూచించారు.
అంటే మార్చి 30న తెలుగు సినిమాలకు తెలంగాణ ప్రభుత్వం సత్కరించబోతోంది. మరి గతేడాదికి సంబంధించి అవార్డులే ఇస్తారా? లేక ఇన్నాళ్లూ పెండింగ్‌లో ఉన్న సినిమాల సంగతి కూడా తేలుస్తారా అనేది చూడాలి. ఆఖరిగా 2016లో నంది అవార్డులు ఇచ్చారు. కాబట్టి 2017 నుండి ఇస్తారు అనే మాట చెప్పలేం. ఆ లెక్కన 2024 అవార్డులు మాత్రమే వస్తాయి. మొన్నే ఆ ఏడాది వెళ్లింది కాబట్టి 2023కి సంబంధించినవి ఇచ్చే అవకాశం ఉంది.
సినిమా నిర్మాణంలో హైదరాబాద్‌ను ప్రపంచ గమ్యస్థానంగా మారుస్తామని ఈ సందర్భంగా భట్టి అన్నారు. జాతీయ సమైక్యత, ఐక్యతను పెంపొందించే సాంస్కృతిక, విద్యా, సామాజిక ఔచిత్యం, అత్యున్నత సాంకేతిక నైపుణ్యం, మానవతా విలువలు ఉన్న సినిమాల నిర్మాణాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ ఆవార్డులు (Gaddar Awards) అందజేస్తున్నాం అని చెప్పారాయన.