సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ రూపొందిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్ర విడుదలను ఆపేయాలని గట్టి ప్రయత్నాలే జరిగాయి. ఇందులో భాగంగా ఈసీకి ఫిర్యాదు చేసి సినిమా విడుదలను ఎన్నికలు పూర్తయ్యే వరకూ వాయిదా వేయాలని కోరారు కొందరు టీడీపీ కార్యకర్తలు. అయితే వారికి ఈసీ షాకిచ్చింది తెలుస్తుంది.అందుతున్న సమాచారం ప్రకారం… ఎలెక్షన్ కమిషన్ ఈ చిత్ర విడుదలను ఆపడం కుదరదని తేల్చి చెప్పేసిందట.
ఇక హైకోర్టులో కూడా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రానికి ఊరట లభించింది. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’, ‘లక్ష్మీస్ వీరగ్రంధం’ సినిమాల విడుదల పై హైకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలైంది. దాన్ని పరిశీలించిన కోర్టు పిటిషన్ ను కొట్టివేసిందని సమాచారం. ప్రతి వ్యక్తికి భావ ప్రకటనా స్వేచ్చ ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసిందట. ఈ చిత్ర విడుదలను ఆపాల్సిన అవసరం లేదని వెల్లడించిందట. ఇక ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సెన్సార్ మార్చి 20 న జరగనుంది. ఇది పూర్తయిన తరువాత ఏమైనా అభ్యంతరాలు వెలువడితే వాటిని సరి చేసి మార్చి 29న విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారట చిత్ర యూనిట్. మరి ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని నమోదుచేస్తుందో చూడాలి.