“భరత్ అనే నేను” షూటింగ్ మొదలైనప్పట్నుంచి సినిమా జోనర్ విషయంలో అందరికీ ఒక క్లారిటీ ఉంది. సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటిస్తున్నాడు కాబట్టి ఇది తప్పకుండా పోలిటికల్ డ్రామా అయ్యి ఉంటుందనే ఊహించారందరూ. వారి ఊహలను నిజం చేస్తూ “భరత్ అనే నేను” ఒక పోలిటికల్ డ్రామాగా రూపొందిన ఏప్రిల్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఘన విజయం సొంతం చేసుకొంది. అయితే.. రెండ్రోజుల క్రితం ఈ చిత్రాన్ని చూసిన తెలంగాణ మంత్రివర్యులు కల్వకుంట్ల తారకరామారావు మాత్రం “భరత్ అనే నేను ఒక మంచి ప్రేమకథ” అని తేల్చేశారు.
నిజానికి కొరటాల శివ కూడా మహేష్ బాబుకి కథ చెప్పినప్పుడు “ఈ సినిమా మంచి ప్రేమకథ” అనే చెప్పాడట. అయితే.. మొన్న సినిమా చూసిన కేటీయార్ మాత్రం “ఈ సినిమాలో ముఖ్యమంత్రిగా నటించిన మహేష్ బాబు 8 నెలలపాటు పాలించిన తన రాష్ట్రాన్ని ప్రేమిస్తాడు, ఆ రాష్ట్రం కోసం పాటుపడతాడు. సో రాష్ట్రాన్ని ప్రేమించిన ఒక ముఖ్యమంత్రి కథ కాబట్టి ఇది కచ్చితంగా ప్రేమకథే” అంటూ సరికొత్త నిర్వచనం చెప్పారు కేటీయార్. తమ చిత్రాన్ని ఈ కోణంలో చూసి, అర్ధం చేసుకొన్నందుకు కేటీయార్ కు కృతజ్నతలు చెప్పారు కొరటాల, మహేష్ బాబులు. ఈ ముగ్గురి ఇంటరాక్షన్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.