నవ్వు నాలుగు విధాలా చేటు అనే నానుడిని నవ్వు నలభై విధాలా గ్రేటు అని మార్చి రాసిన వారిలో బ్రహ్మానందం ఒకరు. మూడు దశాబ్ధాల పాటు తెలుగు ప్రేక్షకుల్ని విశేషంగా నవ్వించిన ఆయన ఈమధ్యకాలంలో సరిగా సినిమాలు చేయడం లేదు. అందరు బ్రహ్మానందం పని అయిపోయింది, కొత్త కామెడియన్ల రాకతో ఈయనకి అవకాశాల్లేకుండాపోయాయి అనుకున్నారు. కానీ.. అసలు విషయం ఏంటంటే గత కొంత కాలంగా ఆయన ఆరోగ్యం సరిగా ఉండడం లేదు. ముఖ్యంగా గుండె సమస్యతో ఆయన బాధపడుతున్నారు. ఇదివరకే ఆయనకు ఒకసారి హార్ట్ ఎటాక్ వచ్చింది. నిన్న మళ్ళీ ఊపిరి సమస్యతో బాధపడుతుండగా.. ముంబై తీసుకెళ్లారు. వెంటనే బైపాస్ సర్జరీ చేయడం మంచిదని డాక్టర్లు చెప్పడంతో ఇమ్మీడియట్ గా నిన్న సాయంత్రమే ఆయనకి బైపాస్ సర్జరీ చేశారట.
ప్రస్తుతం ఆయన ఊపిరి సమస్య తగ్గినప్పటికీ.. కండిషన్ ఇంకా క్రిటికల్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని కోట్ల ప్రేక్షకులను నవ్వించిన బ్రహ్మానందం ఇప్పుడు ఇలా అనారోగ్యంతో మంచానపడడంతో ఆయన అభిమానులు మాత్రమే కాక తెలుగు సినిమా ప్రేక్షకులందరూ బాధపడుతున్నారు. ఆయన పూర్తిస్థాయిలో కోలుకొని హైద్రాబాద్ తిరిగి రావాలని కోరుకొంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన పూర్తి వివరాలు మరికొద్ది గంటల్లో తెలుస్తాయి.