సినిమా అంటేనే వినోదం. జోకులు.. పాటలు.. ఫైట్లు.. ఉండాల్సిందే. అయితే ఒక రాజకీయ నేపథ్య కథను ఎంచుకుంటే మాత్రం సీరియస్ గా ఉంటుంది. ఇదివరకు ఇటువంటి స్టోరీలతో సినిమాలు వచ్చినప్పటికీ కొన్ని మాత్రమే ఓ మోస్తరు విజయం సాధించాయి. చాలా వరకు అపజయాన్ని చవిచూశాయి. అందుకే ఈ జోనర్ జోలికి వెళ్లరు. కానీ నేటి డైరక్టర్లు కథ బార్డర్ దాటకుండా.. అన్ని మిక్స్ చేసి ప్రేక్షకులతో అభినందనలు అందుకుంటున్నారు. రీసెంట్ గా సుకుమార్ ఒక పల్లెటూరిలో జరిగే పంచాయతీ ఎన్నికలను బేస్ చేసుకొని రంగస్థలం సినిమా తీశారు. దీనిని తెలుగు ఆడియన్స్ ఘన విజయాన్ని అందించారు. రామ్ చరణ్ తన నటనతో నాన్- బాహుబలి రికార్డులన్నిటిని బద్దలు కొట్టాడు. రంగస్థలం థియేటర్లలో ఉండగానే మరో రాజకీయ నేపథ్యం కలిగిన మూవీ వచ్చింది.
అదే భరత్ అనే నేను. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ఈ సినిమా మూడు రోజుల్లో వందకోట్లు సాధించింది. ఇది ఒక సీఎం కథ. ఇచ్చిన ప్రామిస్ ని నిలబెట్టుకునే ముఖ్యమంత్రి కథ. రాష్ట్ర రాజకీయాలను చూపించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దేశ రాజకీయ నేపథ్యంలో మరో మూవీ రాబోతోంది. వక్కంతం వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేస్తున్న “నా పేరు సూర్య” లో నేషనల్ పాలిటిక్స్ ఉంటాయని సమాచారం. వచ్చేనెల రిలీజ్ కానున్న ఈ సినిమా కూడా హిట్ సాధిస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.