కాస్ట్యూమ్ డిజైనర్ గా సినిమా ఇండస్ట్రీలో దశాబ్దపు కాలం అనుభవం కలిగిన నీరజ కోన దర్శకురాలిగా పరిచయమవుతూ.. సిద్ధు జొన్నలగడ్డతో కలిసి తెరకెక్కించిన చిత్రం “తెలుసు కదా”. యూత్ ఫుల్ లవ్ స్టోరీ విత్ అ ట్విస్ట్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుంది అనేది చూద్దాం..!!
కథ: చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోయి.. తనకంటూ కుటుంబం లేకపోవడంతో.. ఇష్టపడిన అమ్మాయిని ప్రేమించి, పెళ్లి చేసుకుని, పిల్లల్ని కని, మంచి ఇల్లు, రెండు కార్లు, ఒక కుక్క పిల్లతో సెటిల్ అవ్వాలనుకుంటాడు వరుణ్ (సిద్ధు జొన్నలగడ్డ).
అయితే.. సిద్ధు జీవితంలో ప్రేమ ఆశ చూపించిన రాగ (శ్రీనిధి) చెప్పకుండా వెళ్లిపోతుంది. దాంతో ప్రేమ మీద నమ్మకం కోల్పోయి, మ్యాట్రిమోని సైట్ ద్వారా కలిసిన అంజలి (రాశిఖన్నా)ను పెళ్లి చేసుకుని సెటిల్ అవుతాడు.
కట్ చేస్తే.. వరుణ్, అంజలి & రాగ ఊహించని పరిస్థితిలో కలిసి ఉండాల్సి వస్తుంది. ఏమిటా సందర్భం? ఈ జర్నీలో వాళ్లు రియలైజ్ అయ్యింది ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానమే “తెలుసు కదా” కథాంశం.
నటీనటుల పనితీరు: సిద్ధు ఇంకా టిల్లు మ్యానియాలోనే ఉన్నాడు అనిపిస్తుంది. డైలాగ్ డెలివరీలో అలా అప్పుడప్పుడు టిల్లు వినిపిస్తాడు. క్యారెక్టర్ కి ఉన్న స్ట్రాంగ్ మైండ్ & స్క్రీన్ ప్రెజన్స్ ను బాగా ఎలివేట్ చేశాడు. అయితే.. గెటప్ విషయంలో కంటిన్యూటీ మిస్ అవ్వడం కాస్త డిస్టర్బ్ చేస్తుంది.
రాశిఖన్నా తన కెరీర్లో పోషించిన అన్ని పాత్రల్లో అంజలి కచ్చితంగా స్పెషల్ గా ఉంటుంది. మోడ్రన్ & ఇండిపెండెంట్ ఉమెన్ రోల్ ను మరీ రొటీన్ గా కాకుండా చక్కగా పోషించింది.
శ్రీనిధి శెట్టి క్యారెక్టర్ లో క్లారిటీ లోపించింది. ఎందుకని వద్దనుకుంది, ఎందుకని మళ్లీ కావాలనుకుంది? అనేది ఎక్కడా జస్టిఫై చేయలేదు. దాంతో ఆమె పాత్ర ద్వారా పండాల్సిన ఎమోషన్ వర్కవుట్ అవ్వలేదు.
వైవా హర్ష క్యారెక్టర్ & ఎక్స్ ప్రెషన్స్ ఆడియన్స్ ఎక్స్ పీరియన్స్ ను రిఫ్లెక్ట్ చేస్తున్నట్లుగా ఉంటాయి. అతడి శైలి కామెడీ టైమింగ్ బాగా వర్కవుట్ అయ్యింది.
సాంకేతికవర్గం పనితీరు: ఈ సినిమాకి తన పాటలతో మంచి హైప్ ఇచ్చిన తమన్.. బ్యాగ్రౌండ్ స్కోర్ తో మైనస్ అయ్యాడు. సగం ఓజీ, సగం గుంటూరు కారం బీజీఎంలు వినిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా.. హీరోని ఎలివేట్ చేసిన బ్యాగ్రౌండ్ స్కోర్ నెగిటివ్ ఇంపాక్ట్ ఇచ్చింది. ఎమోషన్ ను ఎలివేట్ చేయాల్సిన చోట కూడా ఏదో సైకో థ్రిల్లర్ సినిమాకి కొట్టినట్లు ఇచ్చిన నేపథ్య సంగీతం సినిమా మూడ్ ని డ్యామేజ్ చేసింది. మరి ఈ చాయిస్ ఆఫ్ బ్యాగ్రౌండ్ స్కోర్ తమన్ దా, లేక హీరోని గ్రే షేడ్ లో చూపించడం కోసం నీరజ తీసుకున్న డెసిషనా అనేది బృందానికే తెలియాలి.
జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. ఫ్రేమింగ్స్, కలరింగ్, డి.ఐ వంటివన్నీ బాగున్నాయి.
ప్రొడక్షన్ డిజైన్ టీమ్ & ఆర్ట్ డిపార్ట్మెంట్ తమ బెస్ట్ ఇచ్చారు. అందువల్ల సినిమా చాలా లావిష్ గా కనిపించింది.
దర్శకురాలు నీరజ కోన ఎంచుకున్న మూలకథలో ప్రస్తుత తరం ప్రేక్షకులకు నచ్చే అంశం ఉంది. ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ ను క్రియేట్ చేసిన విధానం కూడా బాగుంది. అయితే.. ఆ పాయింట్ ను డీల్ చేసిన విధానంలోనే సెన్సిబిలిటీ లోపించింది. పాయింట్ ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేస్తే స్పాయిలర్ అవుతుంది కానీ.. అది ఏమాత్రం కన్విన్సింగ్ గా లేదు. హీరో పాత్రకి పిచ్చ క్లారిటీని కథనంలో చూపించడంలో తడబడింది నీరజ. అందువల్ల.. కథకురాలిగా కాస్త ఎగ్జైట్ చేయగలిగిన నీరజ, దర్శకురాలిగా మాత్రం ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి.
విశ్లేషణ: క్యారెక్టర్ బేస్డ్ సినిమాల్లో భారం మొత్తం సదరు పాత్ర వైఖరి మీదే ఆధారపడి ఉన్నప్పటికీ.. చుట్టూ సందర్బాలు ఆ వైఖరిని నిర్దేశించాలి. అలా కాకుండా పాత్రకు ఇష్టం వచ్చినట్లు వెళ్లిపోతుంది, ఆడియన్స్ కూడా ఆ పాత్రతోనే ట్రావెల్ అవ్వాలి అంటే కుదరదు. “తెలుసు కదా” సినిమాలోని సందర్భాలు హీరో పాత్రను ఏమాత్రం ఎఫెక్ట్ చేయకుండా.. వాడి క్యారెక్టరైజేషన్ కు తగ్గట్లుగా సమస్యలన్నీ సెటిల్ అయిపోతుంటాయి. అందువల్ల రిలేటబిలిటీ లోపిస్తుంది. దాంతో చర్చించే అంశం ఎంత సెన్సిబుల్ అయినప్పటికీ.. ప్రేక్షకులు దానికి కనెక్ట్ అవ్వలేరు. అయినా.. ఇదేమీ ఇప్పటివరకు తెలుగులో రాని వైవిధ్యమైన కథ కాదు, ఆల్రెడీ కొన్ని తెలుగు, హిందీ సినిమాలున్నాయి.
సో, సిద్ధు క్యారెక్టర్ కి ఉన్న క్లారిటీ ఆడియన్స్ ని ఆకట్టుకున్నా.. తమన్ నాన్-సింక్ బీజీఎం, నీరజ డీలింగ్ “తెలుసు కదా” సినిమాని అలరించేలా చేయడంలో విఫలమయ్యాయి.
ఫోకస్ పాయింట్: క్యారెక్టర్ కి ఉన్న క్లారిటీ.. కథనంలో లోపించింది!
రేటింగ్: 2.5/5