అఖండ సినిమాతో మరోసారి తానేంటో నిరూపించుకున్నాడు సంగీత దర్శకుడు థమన్. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ లో థమన్ స్థాయిలో ఎవరూ కూడా న్యాయం చేయలేరు అంటూ అభిమానులు కూడా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ప్రస్తుతం ఈ సంగీత దర్శకుడి చేతిలో పెద్ద సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలకు ఇంకా ఏ స్థాయిలో సంగీతమందిస్తాడో అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో థమన్ బాలీవుడ్ సినిమాలు ఎక్కువగా చేయకపోవడానికి గల కారణాలు కూడా తెలియజేశాడు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర సంగీతదర్శకుడిగా కొనసాగుతున్న థమన్ టాలెంట్ గురించి తెలుసుకున్న కొంత మంది బాలీవుడ్ దర్శకులు గతంలో కొన్ని పాటలను కంపోజ్ చేయించారు. గోల్ మాల్ ఎగైన్, సింబా సినిమాలకు రెండు పాటలు కంపోజ్ చేయడమే కాకుండా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అందించాడు.అయితే ఆ విధంగా వర్క్ చేయడం ఏమాత్రం ఇష్టం లేదట. చేస్తే ఒక సినిమాకు ఒక్కరే మ్యూజిక్ చేయాలి. అదే తరహాలో నేను వర్క్ చేయాలని అనుకుంటాను.
అలా సగం సగం వర్క్ చేయడం నాకు ఏమాత్రం ఇష్టం ఉండదు. బాలీవుడ్ స్టైల్ ఏమిటో నాకు ఇంకా అర్థం కాలేదు. అందుకే అలాంటి పని చేయడం ఇష్టం లేక పారిపోయి వచ్చేసాను అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడు.