ఇంటర్వ్యూ : ‘బ్రో’ ప్రమోషన్లో సంగీత దర్శకుడు తమన్ ఆసక్తికర విషయాలు!

పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కాంబినేషన్లో పి. సముద్రఖని దర్శకత్వంలో రాబోతున్న ‘బ్రో’ సినిమా జూలై 28న విడుదల కాబోతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న తమన్ ప్రమోషన్లలో పాల్గొని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. అవి మీ కోసం :

ప్ర)రీమేక్ సినిమాలకు సంగీతం అందించడం అనేది ఛాలెంజ్ అనిపిస్తుందా?

తమన్ : అవును పెద్ద ఛాలెంజ్. నేను పవన్ కళ్యాణ్ గారితో చేసిన మూడు సినిమాలూ రీమేక్ లే.! ‘వకీల్ సాబ్’ , ‘భీమ్లా నాయక్’, ‘బ్రో’ అన్నీ రీమేక్ లే.ఆ మూడు సినిమాలకి సాంగ్స్ బాగా హెల్ప్ చేస్తాయి. వకీల్ సాబ్ లో మగువా మగువా పాట బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను మాస్ ఫైట్ కోసం వాడాల్సి వచ్చింది.

ప్ర)’బ్రో’ ఎలా ఉండబోతుంది?

తమన్ : ‘బ్రో’ అనే సినిమా రిలీజ్ అయ్యాక ఎంతోమందిని కదిలిస్తుంది.ఎమోషనల్ సీన్స్ ఎన్నో ఉంటాయి. స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అద్భుతంగా వచ్చాయి. త్రివిక్రమ్ గారి స్క్రీన్ ప్లే సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుంది. దానిని పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ ఇంకా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది.

ప్ర) వినోదయ సీతమ్ ప్రభావం ఈ సినిమా పై ఉందా?

తమన్ : ఒరిజినల్లో సాంగ్స్ లేవు.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగా చేశారు. అక్కడ ఆ పాత్ర సముద్రఖని గారు చేశారు కాబట్టి దానికి అది సరిపోతుంది. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చేశారు కాబట్టి ఈ సినిమా స్పాన్ పెరిగింది. పవన్ కళ్యాణ్ స్క్రీన్ పై కనిపిస్తే చాలు సంగీతం కావాలనుకుంటాం. అందుకే శ్లోకం పెట్టాం. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి చాలా కష్టపడి చేశాం. బాగా వచ్చింది.

ప్ర)మీ పాటలు రిలీజ్ అయ్యాయి అంటే కాపీ అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలవుతుంది?

తమన్ : కొత్తగా ఎవ్వరూ చేయడం లేదు. నా కెరీర్ ప్రారంభం నుండి చేస్తున్న వాడే ఇప్పుడూ చేస్తున్నాడు. నా కెరీర్ ప్రారంభం నుండి ఇలాంటి ట్రోలింగ్ ను ఫేస్ చేస్తూనే ఉన్నాను.

ప్ర) మార్కండేయ సాంగ్ కి రెస్పాన్స్ ఎలా ఉంది?

తమన్ : మిక్స్డ్ గా ఉంది. ఆ పాట మాస్ సాంగ్ కాదు, ఐటెం సాంగ్ కాదు. కథ ప్రకారం సిట్యువేషన్ అనుగుణంగా వచ్చే పాట అది. అందుకే రెస్పాన్స్ మిక్స్డ్ గా ఉంది.

ప్ర) పవన్ కళ్యాణ్ గారి సినిమాకి పని చేయడం అనేది ప్లెజరా? ప్రెజరా?

తమన్ : ఒక అభిమానిగా ప్లెజర్, అభిమానుల నుంచి ప్రెజర్. ఇలాంటి సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసి మెప్పించడం అనేది ఇంకా ప్రెజర్ అనిపిస్తుంది.

ప్ర) అభిమానుల నుండి ప్రెజర్ ఎక్కడ నుండి వస్తుంది? ట్విట్టర్ నుండేనా?

తమన్ : అంతే కదా బ్రదర్..! అక్కడ నుండే మన గురించి చాలా విషయాలు తెలుస్తాయి. ఇది ఒక అడవిలాంటిది. అన్నీ తెలుసుకోవాలి అంటే ఇక్కడ రోజూ తిరుగుతూ ఉండాలి(నవ్వుతూ)

ప్ర) ‘తమ్ముడు’ లో ‘వయ్యారి భామ’ సాంగ్ లో ఉన్న గెటప్ లో మళ్ళీ పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నారు కదా..? ఆ సన్నివేశం యొక్క నేపథ్యం ఏంటి?

తమన్ : మీరు సినిమా చూడండి బ్రదర్. ప్రతి సన్నివేశం నచ్చుతుంది. పవన్ కళ్యాణ్ చాలా బాగా చేశారు. చాలా రోజుల తర్వాత నేను వేరే పవన్ కళ్యాణ్ గారిని చూశాను. మీరు కూడా చూస్తారు.

ప్ర)’గుంటూరు కారం’ లో మిమ్మల్ని తీసేసాను అంటూ ప్రచారం జరుగుతుంది.. దాని గురించి క్లారిటీ ఇవ్వండి ..!

తమన్ : 6 నెలల నుండి దాని పై పని చేస్తున్నాం.అందరూ ఈ సినిమా పైనే పడుతున్నారు. సోషల్ మీడియాలో జరిగే అసత్య ప్రచారాలు పట్టించుకోకండి. ఏదైనా ఉంటే నిర్మాతలే అధికారికంగా ప్రకటిస్తారు. కావాలని ఎవరూ ఫ్లాప్ సినిమాలు చేయరు. కొన్ని సార్లు సినిమా ఆలస్యమవుతుంది. గతంలో కొన్ని సినిమాలు 3, 4 ఏళ్ళు టైం పట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ప్ర) దర్శకుడు సముద్రఖని గారితో పని చేయడం ఎలా అనిపించింది?

తమన్ : ఫస్టాఫ్ సినిమా చూసి ఆయన (Thaman) కన్నీళ్లు పెట్టుకున్నారు. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టాడని అందరికీ చెప్పేశారు. ఒక దర్శకుడు కన్నీళ్లు పెట్టుకోవడం నేను ఫస్ట్ టైం చూశాను. సినిమాలో అలాంటి అద్భుతమైన సన్నివేశాలు చాలా ఉన్నాయి. సెకండాఫ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్క్ జరుగుతుంది. ఇలాంటి సినిమాలకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొట్టాలంటే కథలో బాగా లీనమవ్వాలి. ఇందులో చాలా ఎమోషనల్ కంటెంట్ ఉంది.అది నా పై కొంచెం ఒత్తిడి పెంచుతుంది కూడా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus