ఎవరు పని చేసిన సినిమా మీద వారికి ప్రేమ ఉంటుంది. ఆ సినిమాను ఎవరైనా, ఏమైనా అంటే కోపం కట్టలు తెచ్చుకుంటుంది. అయితే ఆ కోపాన్ని ప్రదర్శించడం ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు. ఈ విషయంలో శ్రుతి మించితే అస్సలు బాగోదు. ఇది ఒక రకం. ఇప్పుడు మరో రకం చూద్దాం. ఒకవేళ ఎవరైనా, ఆ సినిమా గురించి మంచిగా చెప్తే చాలా ఆనందంగా ఉంటుంది. ఇక్కడ ఆ ఆనందాన్ని చూపించకపోతే అస్సలు బాగోదు. రెండో కాంటెక్స్ట్‌లో బాగా ఆనందపడి, మొదటి కాంటెక్స్ట్‌లో నోరు చేసుకుంటే…
ఇది ఇంకా చాలా చాలా బాగోదు. ప్రస్తుతం సంగీత దర్శకుడు తమన్ ఇలాంటి పనే చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల విడుదలైన ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమాకు తమన్ నేపథ్య సంగీతం అందించారు. అందులో తమన్ పనితనానికి మంచి మార్కులే పడ్డాయి కూడా. సోషల్ మీడియాలో తమన్ పనితనాన్ని మెచ్చుకుంటూ చాలా పోస్టులు కనిపిస్తున్నాయి. ఫలానా సీన్‌లో బీజీఎం బాగుంది అంటూ వీడియోలు కూడా వస్తున్నాయి. వాటికి తమన్ చాలా సంతోషంగా రీట్వీట్లు చేస్తూ మెచ్చుకుంటున్నారు.
పనిలోపనిగా సినిమాకు సంబంధించి పాజిటివ్ ట్వీట్లను కూడా రీట్వీట్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో సినిమా మీద వస్తున్న నెగిటివిటీని తగ్గించే ప్రయత్నమూ చేస్తున్నారు. ముఖ్యంగా కొన్ని పోర్షన్లలో సినిమా స్లోగా ఉంది అంటూ నెటిజన్లు చేస్తున్న ట్వీట్ల విషయంలో తమన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆఖరికి ఈ విషయాన్ని ఇటీవల జరిగిన ప్రెస్ మీట్‌లో కూడా ప్రస్తావించారు. సినిమా గురించి వస్తున్న కామెంట్లను ప్రెస్ మీట్‌లో ప్రస్తావించడం తప్పు కాదు.
అయితే వాటి గురించి చెబుతూ తమన్ చెప్పిన విధానమే ఇక్కడ ఇబ్బందిగా ఉంది అంటున్నారు నెటిజన్లు. ‘అఖండ’ సినిమా విషయంలో తమన్‌ను మెచ్చుకున్నవాళ్లు, ఆ సినిమాను పొగిడినవాళ్లు ఇప్పుడు సినిమా గురించి ఇలా అనేసరికి తమన్ తట్టుకోలేకపోతున్నారని నెటిజన్లు అంటున్నారు. ప్రెస్ మీట్‌లో తమన్ మాట్లాడుతూ క్రిటిక్స్ గురించి, సినిమాపై వారు చేసే విశ్లేషణ గురించి మాట్లాడారు. ‘రాధేశ్యామ్’ను విశ్లేషిస్తున్న విధానం సరికాదు అన్నట్లుగా అన్నారు. మరి ‘అఖండ’ సినిమాకు తమన్ పనితనాన్ని, సినిమాను విశ్లేషించి టాప్ నాచ్ వర్క్ అన్నది ఆ క్రిటిక్సే.. అలాగే ఆ నెటిజన్లే. అప్పుడు వాళ్లు విశ్లేషించొచ్చు, ఇప్పుడు విశ్లేషించకూడదా? ఏమో మరి తమన్ ఏమంటారో?