తండేల్ సినిమా రిలీజ్ టైమ్ కే అదే కథతో ఒక వెబ్ సిరీస్ రానుందనే వార్తలు హల్ చల్ చేశాయి. సినిమాకి డ్యామేజ్ అవ్వనివ్వకూడదని అల్లు అరవింద్ కలగజేసుకుని ఆ సిరీస్ ని పోస్ట్ పోన్ చేయించారు. “అరేబియా కడలి” ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఇదేంటి “తండేల్”లా ఉంది అని చాలా మంది అనుకున్నారు. కట్ చేస్తే.. నిన్న సిరీస్ రిలీజ్ అయ్యాక “తండేల్” సినిమాని ఈ సిరీస్ లా ఉంది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
మరీ ముఖ్యంగా.. “తండేల్” సినిమాని రెండు పాత్రల నేపథ్యంలో మాత్రమే చూపించారు కానీ, మిగతా సహచర పాత్రల గురించి కానీ, వారి బాధల గురించి పెద్దగా ప్రస్తావించలేదు. అలాగే పాకిస్థాన్ వైపు నుండి కూడా భారతీయ మత్స్యకార ఖైదీలకు సహాయం అందిన విషయాన్ని “తండేల్”లో ఎక్కడా చూపించలేదు. కానీ.. “అరేబియా కడలి” సిరీస్ లో మాత్రం ఆ అంశాలన్నీ చాలా నిశితంగా చూపించారు.
అన్నిటికీ మించి మత్స్యకారులు పాకిస్థాన్ నుంచి వెనక్కి రావడమే ధ్యేయం కాదని, వారి బ్రతుకు తెరువు కూడా కీలకమని క్రిష్ & టీమ్ ఈ సిరీస్ లో చూపించిన తీరు విశేషంగా ఆకట్టుకుంటుంది. ఒకవేళ “తండేల్” చూసేసినా అది “అరేబియా కడలి” సిరీస్ కి ఒక ట్రైలర్ లాంటిదే తప్ప, అది చూసినవాళ్లు ఇది చూడకూడదు అనే లెక్కలు లేవని చెప్పొచ్చు.
సత్యదేవ్, ఆనంది నటన కోసం, క్రిష్ మానవీయ కోణాల్ని స్పృశించిన విధానం కోసం, సూర్య కుమార్ దర్శకత్వ ప్రతిభ అండ్ సమీర్ రెడ్డి విజువల్స్ కోసం “అరేబియా కడలి” సిరీస్ ను కచ్చితంగా చూడాల్సిందే. అన్నిటికీ మించి 8 ఎపిసోడ్స్ ఈ సిరీస్ ఎక్కడా బోర్ కొట్టదు. అందువల్ల కుటుంబంతో కలిసి హ్యాపీగా బింజ్ వాచ్ చేసే సిరీస్ ను వెంటనే స్టార్ట్ చేసేయండి.