Thank You Review: థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

  • July 22, 2022 / 12:51 PM IST

“జోష్”తో తనను ప్రేక్షకులకు పరిచయం చేసిన దిల్ రాజు నిర్మాణంలో నాగచైతన్య నటించిన తాజా చిత్రం “థ్యాంక్ యూ”. “మనం” తర్వాత విక్రమ్-చైతూ కలిసి పని చేసిన సినిమా ఇది. ఇప్పటివరకూ విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై ఎలాంటి ఆసక్తి రేకెత్తించలేకపోయాయి. మరి సినిమాతోనైనా విక్రమ్ మ్యాజిక్ చేశాడో లేదో చూద్దాం..!!

కథ: తన జీవితంలో, కెరీర్ లో తను తప్ప వేరెవరూ లేరని, ఉండకూడదని భావించే కుర్రాడు అభి (నాగచైతన్య). తాను కనుగొన్న యాప్ ఎంతో గొప్ప సక్సెస్ సాధించి, బోలెడంత డబ్బు, పేరు వచ్చినప్పటికీ.. తన యాటిట్యూడ్ వల్ల తన చుట్టూ ఉన్న మనుషుల్ని కోల్పోతుంటాడు.

ఒకానొక సందర్భంలో తన జీవితంలో చోటు చేసుకున్న మార్పులకు, కెరీర్ లో ఎదుగుదలకు కారణమైన వారికి “థ్యాంక్ యూ” చెప్పాలని నిర్ణయించుకుంటాడు. అలా మొదలైన ప్రయాణం ఎక్కడికి చేరింది? అనేది చిత్ర కథాంశం.

నటీనటుల పనితీరు: నాగచైతన్య ప్రతి సినిమాతో నటుడిగా ఎదుగుతున్నాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో చైతూ చూపిస్తున్న పరిణితిని తప్పకుండా ప్రశంసించాల్సిందే. చైతూ క్యారెక్టర్ కి మంచి డెప్త్ ఉంది కానీ.. క్లారిటీ మిస్ అయ్యింది. ఈ తరహా పాత్రలు ఇప్పటికే కొన్ని వందల సినిమాల్లో చూసేశామ్. అందువల్ల కొత్తగా ఆ పాత్రను ఓన్ చేసుకోలేరు ప్రేక్షకులు. రాశీఖన్నా పాత్ర కాస్త “వరల్డ్ ఫేమస్ లవర్” తరహాలోనే ఉండడం మైనస్. ఆమె నటన బాగున్నప్పటికీ.. పాత్ర తీరుతెన్నులు మాత్రం వివిధ చిత్రాలను గుర్తు చేయడంతో ఈ క్యారెక్టర్ కు కూడా కనెక్ట్ అవ్వలేం.

“ఈ నగరానికి ఏమైంది?” ఫేమ్ సుశాంత్ రెడ్డి పాత్ర బాగుంది, అతడి ఎనర్జీ కూడా కనెక్ట్ అవుతుంది. అలాగే ప్రకాష్ రాజ్ పాత్ర చిన్నదే అయినా.. ఎమోషన్ స్ట్రాంగ్ గా ఉంది. మాళవిక నాయర్, ఆవికా గోర్ లు తమ తమ పాత్రల పరిధి మేరకు పర్వాలేదనిపించుకున్నారు.

సాంకేతికవర్గం పనితీరు: పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రఫీ ఒక్కటే సినిమా మొత్తానికి చెప్పుకోదగ్గ అంశం. సినిమాలో, కథలో పెద్దగా కంటెంట్ లేనప్పటికీ.. సాధారణ కథను తన లెన్స్ లో అసాధారణంగా చూపించడానికి ఆయన పడిన తపన ప్రశంసనీయం. తమన్ పాటలు, నేపధ్య సంగీతం ఎలాంటి వేల్యూ యాడ్ చేయలేకపోయాయి. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ సోసోగా ఉన్నాయి.

దర్శకుడు విక్రమ్ తన ప్రతి కథలో ఒక అసాధారణమైన అంశాన్ని చాలా సాధారణంగా వివరించి.. ఎమోషన్స్ ను అత్యద్భుతంగా ఎలివేట్ చేస్తాడు. కానీ.. బి.వి.ఎస్.రవి రాసిచ్చిన కథలో పట్టు లేకపోవడం వల్లనో.. కథకి విక్రమ్ పూర్తిగా కన్విన్స్ అవ్వకపోవడం వల్లనో.. ఈ సినిమాలో ఒకట్రెండు ఎపిసోడ్స్ మినహా ఎక్కడా విక్రమ్ కుమార్ మార్క్ కనిపించదు. దర్శకుడిగా ఈ చిత్రంతో విక్రమ్ కుమార్ ఆడియన్స్ ను అలరించలేకపోయాడనే చెప్పాలి.

విశ్లేషణ: తన జీవితాన్ని తానే వెనక్కి తిరిగి చూసుకుని.. తనకు సహాయం చేసినవాళ్లందరికీ థ్యాంక్స్ చెప్పడం కోసం ఓ యువకుడు జర్నీ మొదలెట్టడం, ఆ జర్నీలో ఎన్నో విషయాలను తెలుసుకోవడం అనేది చాలా ఎమోషనల్ స్టోరీ. అయితే.. “థ్యాంక్ యూ”లో ఆ ఎమోషన్ మిస్ అయ్యింది, అలాగే ప్రతి సన్నివేశాన్ని ఆడియన్స్ ముందే గెస్ చేయగలగడం పెద్ద మైనస్. సో, విక్రమ్ కుమార్ & నాగచైతన్య వీరాభిమానులను మినహా “థ్యాంక్ యూ” రెగ్యులర్ ఆడియన్స్ ను ఆకట్టుకోలేదనే చెప్పాలి.

రేటింగ్: 2/5

Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus