నంది గొడవలను బ్యాగ్రౌండ్ లో డైరెక్ట్ చేస్తున్నారా!

నిజమే మనది ప్రజాస్వామ్య దేశం. ఎవరు ఎవరిపైనయినా యథేచ్ఛగా విమర్శలు చేయవచ్చు. తమ అభిప్రాయాలు స్వేచ్ఛగా వ్యక్తీకరించుకోవచ్చు. తమ నిరసనను నిరభ్యంతరంగా వ్యక్తీకరించవచ్చు. అయితే.. ఆ నిరసనలు, విమర్శలు ఎదుటివారి మనోభావాలను పొరపాటున కూడా గాయపరచకూడదు. నీ చేయిని నీ ఇష్టం వచ్చినట్లు సాచవచ్చు.. లేదా గాల్లో తిప్పుకోవచ్చు. కానీ అది ఎదుటివారి ముక్కుకు తగలనంతవరకు మాత్రమేనన్న విషయాన్నిఎప్పుడూ స్పృహలో ఉంచుకోవాలి. కానీ ఇప్పుడు మన చిత్ర పరిశ్రమలో కొందరు వ్యక్తులు ‘ఆ స్పృహ’ లేకుండా విమర్శలు చేస్తున్నారేమోననిపిస్తోంది. అవును.. నంది అవార్డుల ఎంపికపై వెలువడుతున్న విమర్శలపై ఇప్పుడు ఇటువంటి విమర్శలే వెలువడుతున్నాయి. నంది అవార్డుల ఎంపికను తప్పు పడుతూ చేస్తున్న వ్యాఖ్యలు మరీ శృతిమించుతున్నాయని చెప్పక తప్పదు.

నంది అవార్డుల ఎంపిక తీరును తప్పు పడుతూ ఒక ప్రముఖ దర్శకుడు నేరుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబు స్వయంగా దగ్గరుండి.. మిగతా పనులన్నీ మానుకొని అవార్డుల ఎంపికను పర్యవేక్షించినట్లుగా ఆయన చంద్రబాబును ఉద్దేశించి ఆ లేఖ రాశారు. మరో యువ నిర్మాత.. మరి కొంచెం ముందుకెళ్లి.. నంది అవార్డులు గెలుచుకోవాలంటే.. తెలుగుదేశం ప్రభుత్వం నుంచి నటనలో మెళకువలు నేర్చుకోవాలేమోనని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. చెక్ బౌన్స్ సహా పలు పోలీసు కేసులు ఎదుర్కొంటున్న మరొక ఆల్ రౌండర్ నంది అవార్డుల్ని సైకిల్ అవార్డులుగా ప్రకటించి పారేశాడు.

ప్రభుత్వంచే నియమితమైన జ్యూరీ ఎంపిక చేసిన అవార్డుల్లో లోపాలు ఎత్తి చూపడం ఎంతమాత్రం తప్పుకాదు. కానీ అందుకు ఏకంగా ప్రభుత్వాన్ని బాధ్యుల్ని చేయడం, సాక్షాత్తూ ప్రభుత్వాధినేతకు పక్షపాతాన్ని అంటగట్టాలని చూడడం మాత్రం సమర్ధనీయం కాదు. తమకు, తమ సినిమాలకు అవార్డులు రాకపోవడంపై అసంతృప్తి చెందడం వరకు ఓకే. కానీ.. అవార్డులు గెలుచుకున్న సినిమాలను చులకన చేసి మాట్లాడడం కచ్చితంగా క్షంతవ్యం కాదు. అవార్డులు గెలుచుకున్నవారు ఆనంద పడకుండా.. వారు గిల్టీగా ఫిలయ్యేలా చేయడం సంస్కారం కూడా కాదు. ఇటువంటి వాచాలత్వం కలిగినవారిపై కన్నెర్ర జేయాల్సిన అవసరం, కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే.. ఇలాంటివాళ్ళను ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో మరింతమంది మరిన్ని నేలబారు విమర్శలు చేసే ప్రమాదముంది. ఏ అవార్డు అయితే రాలేదని వాపోతున్నామో.. ఆ అవార్డు ఔన్నత్యం దెబ్బతినేలా వ్యవహరించడం మంచిది కాదు.

అయితే.. ఈ గొడవలన్నీ ఇండస్ట్రీలో “ఆ నలుగురు” అని చెప్పుకొనే పెద్దల్లో ఒకరి డైరెక్షన్ లోనే జరుగుతున్నాయని స్ట్రాంగ్ టాక్. మరి ఆ పెద్దాయనకి ఈ గొడవల కారణంగా ఏం ఉపయోగం ఉందో తెలియదు కానీ.. ఆయన మాత్రం తన అనుచరులను గట్టిగా వాడుకొని రచ్చ చేయిస్తూ ఈ గొడవల్ని ఎంజాయ్ చేస్తున్నాడాయన.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus