బాహుబలి స్పూర్తితో తెరకెక్కుతోన్న చిత్రాలు

  • May 24, 2017 / 01:22 PM IST

బాహుబలి సినిమా కోట్లమందికి నచ్చింది. లక్షల మందికి లాభాలని పంచింది. వేలమందికి పేరు తీసుకొచ్చింది. వందలమందికి స్ఫూర్తినించింది. అదే స్పూర్తితో కొంతమంది భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారు. అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఆ సినిమాలు ఏంటంటే..

సంఘమిత్ర బాహుబలి స్పూర్తితో తమిళ దర్శకుడు సుందర్.సి సంఘమిత్ర అనే సినిమాని తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. జయం రవి, ఆర్య, శృతి హాసన్ ప్రధాన పాత్రలలో రూపొందనున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని కేన్స్ వేడుకలో రిలీజ్ చేశారు. యువరాణిగా శృతి గుర్రం ఎక్కిన పోస్టర్ అన్ని పరిశ్రమలు ఉలిక్కిపడేలా చేసింది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. బాహుబలి చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేసిన సాబు సిరిల్ ఈ ప్రాజెక్ట్ లో భాగస్వామ్యం కావడం విశేషం. ఇది రెండు భాగాలుగా రిలీజ్ కానుంది.

మరుదనాయగం కేన్స్ ఫిలిం ఫెస్టివెల్ లో అందర్నీ ఆశ్చర్య పరిచిన మరో విషయం మరుదనాయగం ఫస్ట్ లుక్. విశ్వనటుడు కమల హాసన్ డ్రీమ్ ప్రాజక్ట్ కూడా బాహుబలి ఇచ్చిన ఉత్సాహంతో పూర్తి రూపం దాల్చుకోనుంది. ఈ మూవీ డైరక్టర్, నిర్మాతల వివరాలు త్వరలో కమలహాసన్ ప్రకటించనున్నారు.

పద్మావతి బాజీరావ్ మస్తానీ వంటి అద్భుత చిత్రాన్ని మనకందించిన సంజయ్ లీల భన్సాలీ బాహుబలి బిగినింగ్ తర్వాత పద్మావతి అనే చిత్రాన్ని మొదలెట్టారు. రాణి పద్మావతి జీవిత కథ ఆధారంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి మొదట 150 కోట్లు బడ్జెట్ అనుకున్నారు. బాహుబలి కంక్లూజన్ తర్వాత ఈ మూవీ బడ్జెట్ ని మరో 50 కోట్లు పెంచారు. షాహిద్ కపూర్, రన్ వీర్ సింగ్ తదితరులు కీలక పాత్ర పోషిస్తోన్న ఈ మూవీతో బాహుబలి రికార్డ్స్ ని కొల్లగొట్టాలని చూస్తున్నారు.

మణికర్ణిక – ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ మణికర్ణిక… ఈ పేరు ఎవరికీ తెలియక పోవచ్చు. ఝాన్సీ రాణి లక్ష్మి భాయి అంటే తెలుసు. ఝాన్సీ రాణి అసలు పేరు మణికర్ణిక. ఆ పేరుతో సినిమా రానుంది. వీరనారి పాత్రని బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ పోషించనుంది. జీ స్టూడియోస్, కమల్ జైన్ సమర్పణలో కైరోస్ కంటెంట్ స్టూడియోస్ బ్యానర్లో సంజయ్ కుట్రీ, నిషాద్ పిట్టి హిందీలో నిర్మిస్తున్న ఈ మూవీకి విజయేంద్రప్రసాద్ కథను అందించగా .. క్రిష్ దర్శకత్వం వహించనున్నారు.

మహాభారతంప్రముఖ రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఎమ్టీ వాసుదేవన్ నాయర్ రచించిన ‘రండమోజమ్’ అనే నవల ఆధారంగా ఓ మూవీ రూపుదిద్దుకోనుంది. శ్రీకుమార్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీకి మహాభారతం అనే పేరు పరిశీలిస్తున్నారు. భీముడు చుట్టూ తిరిగే కథలో ఆ పాత్రలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ఖరారు అయ్యారు. ప్రముఖ వ్యాపారవేత్త డా. బి. ఆర్.శెట్టి వెయ్యికోట్లతో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.

లారెన్స్ – విజయేంద్ర ప్రసాద్ బాహుబలి చూసి నృత్య దర్శకుడు లారెన్స్ బాగా ఇన్ స్పైర్ అయ్యారు. ఒక పీరియాడిక్ మూవీ తీయాలని అనుకున్నారు. బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ తో కలిసి మంచి కథ కోసం చర్చిస్తున్నారు. ఈ సినిమాని రాజమౌళి వద్ద అసిస్టెంట్ గా చేసిన వ్యక్తి తో తెరకెక్కించాలని ఆలోచనలో ఉన్నారు. కథ ఇంకా కొలిక్కి రాకముందే లీడ్ క్యారక్టర్ లో కాజల్ అగర్వాల్ ని ఖరారు చేశారు. స్టోరీ లాక్ కాగానే ఈ మూవీ గురించి అధికారిక ప్రకటన రానుంది.

రామాయణం బాహుబలి లాంటి మరో ప్రాజెక్ట్ తెలుగు చిత్ర పరిశ్రమలో రూపుదిద్దుకోనుంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రాలతో కలిసి 500 కోట్లతో రామాయణం తెరకెక్కించనున్నారు. తెలుగు, తమిళం, హిందీ వంటి మూడు ప్రధాన భాషల్లో త్రీడీ వెర్షన్లో మూడు భాగాలుగా రూపొందునున్న ఈ మూవీలో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ పరిశ్రమకు చెందిన నటీనటులు నటించనున్నారు. వారి కోసం ప్రస్తుతం సెలక్షన్ జరుగుతోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus