Tiger Nageswara Rao: స్టువర్ట్‌పురం గజదొంగ ‘టైగర్ నాగేశ్వరరావు’ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

  • May 29, 2023 / 08:00 PM IST

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న మొదటి పాన్ ఇండియా సినిమా ‘టైగర్ నాగేశ్వరరావు’. వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ‘అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్’ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నాడు. ఇటీవల ఈ చిత్రం నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ ను అలాగే చిన్న గ్లింప్స్ ను విడుదల చేశారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ , మలయాళ భాషల్లో ఈ చిత్రం గ్లింప్స్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.

తెలుగులో గ్లింప్స్ కు వెంకటేష్, తమిళ్ గ్లింప్స్ కు కార్తీ, హిందీ గ్లింప్స్ కు జాన్ అబ్రహం, కన్నడ గ్లింప్స్ కు శివరాజ్ కుమార్, మలయాళం గ్లింప్స్ కు దుల్కర్ సల్మాన్ వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది. ఈ గ్లింప్స్ కూడా చాలా బాగుంది. రవితేజ ఈ మూవీతో పెద్ద బ్లాక్ బస్టర్ అందుకోవడం గ్యారెంటీ అని అంతా భావిస్తున్నారు. ఈ క్రమంలో ‘టైగర్ నాగేశ్వరరావు’ గురించి చర్చలు ఎక్కువయ్యాయి. అతను ఎవరో.. ఏం చేసేవాడో ఇప్పుడు తెలుసుకుందాం రండి :

1) ఆంధ్రప్రదేశ్‌లోని స్టువర్ట్‌పురం గ్రామం పేరు కచ్చితంగా అంతా వినే ఉంటారు. బాపట్లకు సరిగ్గా 15 కిమీల దూరంలో ఉండే ‘స్టువర్ట్‌పురం’ గురించి గతంలో కూడా సినిమాలు వచ్చాయి. చిరంజీవి ‘స్టువర్ట్‌పురం పోలీస్ స్టేషన్’, బానుచందర్ ‘స్టువర్ట్‌పురం దొంగలు’ సినిమాలు ‘స్టువర్ట్‌పురం’ బ్యాక్ డ్రాప్ తో వచ్చినవే. కానీ ఆ సినిమాలు నిరాశపరిచాయి.ఇప్పుడు ‘టైగర్ నాగేశ్వరరావు’ రాబోతుంది.

2) బ్రిటీష్ పాలనలో ఉండగానే స్టువర్టుపురం దొంగల గురించి కథలు కథలుగా చెప్పుకునేవారు. 1913లో అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీ హోం సభ్యుడు హెరాల్డ్ స్టువర్ట్.. ఉపాధి లేక దొంగలుగా మారిన వారికి పారిశ్రామిక, వ్యవసాయ పనులను కల్పించాలని సాల్వేషన్ ఆర్మీని కోరాడట. అంతేగాక వారికి ప్రత్యేకంగా పునరావాసం కల్పించి.. ఉపాధి, నివాసం కల్పించడం వల్ల వారు నేరాలకు దూరంగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆయన డిమాండ్ మేరకు బిట్రీష్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన కాలనీ పేరే.. ‘స్టువర్ట్‌పురం’.

3) ఎక్కువమంది నేరాలు చేసినవారిని అక్కడికి తరలించి వారిపై నిఘా ఉంచేవారు పోలీసులు. ఎక్కడ దొంగతనం జరిగినా మొదట ఇక్కడికే వచ్చి ఆరా తీసేవారు. ఇప్పుడైతే అలాంటి పరిస్థితి ఏమీ లేదు.

4) ఇక టైగర్ నాగేశ్వరరావు సంగతికి వచ్చేద్దాం. 1970-80 ల కాలానికి చెందినవాడు. పోలీసులకు ఇతని పేరు వింటేనే వణుకు పుట్టేది. వారికి నిద్రలేకుండా చేసేవాడు.అలా అని ఇతను చెడ్డ దొంగ మాత్రం కాదని, ఉన్నవాళ్ల దగ్గర దోచుకుని.. పేదలకు పెట్టేవాడు అని అంటుంటారు. అనేక రాబిన్ హుడ్ కథలకు ఇతను స్ఫూర్తి అని అంటుంటారు. ఇతన్ని ఇండియన్ రాబిన్ హుడ్ అని ఇతనికి మరో పేరు ఉంది.

5) పోలీసులు పట్టుకున్నప్పటికీ నాగేశ్వరరావు… ఈజీగా తప్పించుకునేవాడు. జైళ్లు కూడా ఇతన్ని ఆపేవి కాదట. చెన్నై వంటి కఠినమైన జైలు నుండి తప్పించుకుని ఇతను ఫేమస్ అయ్యాడు.అప్పటి నుండి ఇతన్ని టైగర్ అనేవారు. నాగేశ్వరరావు అనే పేరు ముందు ‘టైగర్’ వచ్చి చేరడానికి కూడా అదే కారణం.

6) టైగర్ నాగేశ్వరావుకి ఓ సోదరుడు కూడా ఉన్నాడు. అతని పేరు ప్రభాకరరావు. టైగర్ నాగేశ్వరావు చేసే దొంగతనాల్లో అతనికి కుడి భుజంగా నిలిచాడు అని అంటుంటారు.

7) 1974 లో కర్నూలు జిల్లాలోని బనగానపల్లె మండలంలో ఉన్న బ్యాంకు దోపిడీ.. ‘టైగర్ నాగేశ్వరరావు’ చేసిన పెద్ద నేరం అని అంతా అంటుంటారు. అయితే అందులో ఉన్నది అంతా కూడా ప్రజల నుండి దోచుకున్న డబ్బే అనే వాళ్ళు కూడా ఉన్నారు.

8) ఆ బ్యాంకు దోపిడీకి ప్రభాకర్ సూత్రధారిగా వ్యవహరించాడట.అప్పటికి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అదే అతి పెద్ద బ్యాంకు దోపిడీ .ఇందులో దాదాపు రూ.35 లక్షలు విలువ చేసే బంగారాన్ని దొంగిలించారని చెప్పుకుంటారు.

9) ఈ బ్యాంక్ దోపిడీ గురించి ప్రభాకర్ ఓ మీడియాకి కీలకమైన విషయాలు చెప్పుకొచ్చాడు. “ఆ బ్యాంక్ దోపిడీలో మొత్తం పదిమంది ముఠా సభ్యులుం పాల్గొన్నాం. పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉండే బ్యాంకును మేం టార్గెట్ చేశాం. అర్ధరాత్రి బ్యాంకు వెనుక తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళాం. 14 కిలోల బంగారం, రూ.50,000 నగదు అందులో ఉంది. దీన్ని సభ్యులమంతా పంచుకోకముందే పోలీసులు మా గ్రామాన్ని చుట్టుముట్టారు. వేరే దారి లేకపోవడంతో ఓ మధ్యవర్తి ద్వారా లొంగిపోవాలని నిర్ణయించుకున్నాం’’ అంటూ చెప్పుకొచ్చాడు.

10) పోలీసులు ప్రభాకర్ ను అదుపులోకి తీసుకున్నారు. మరోపక్క అప్పటికే టైగర్ నాగేశ్వరరావు స్టువర్ట్‌పురం నుంచి పరారయ్యాడు. ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలో ఈ బ్యాంక్ దోపిడీ హైలెట్ సీన్ అని చెబుతున్నారు.

11) ఇక 1987లో టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao) పోలీసుల ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు అని అంటుంటారు. అధికారికంగా టైగర్ నాగేశ్వరరావు చనిపోయింది అలానే అని చెప్పినా.. దీని వెనుక వేరే కథ కూడా ఉన్నట్లు కొంతమంది అంటుంటారు. సినిమాలో ఎలా చూపిస్తారో మరి..!

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus