స్వయంవరం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వేణు తక్కువ సమయంలోనే నటుడిగా తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. తొలి సినిమాతోనే నంది స్పెషల్ జ్యూరీ అవార్డ్ ను వేణు అందుకున్నారు. ఆ తరువాత వేణు నటించిన చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్, కళ్యాణరాముడు, పెళ్లాం ఊరెళితే, ఖుషిఖుషీగా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్లుగా నిలిచాయి. అయితే గత కొన్నేళ్లుగా వేణు సినిమాల్లో నటించడం లేదు. భిన్నమైన కథలను ఎంచుకుంటూ అన్ని రకాల పాత్రల్లో నటించిన వేణు గోపి గోపిక గోదావరి మూవీతో సక్సెస్ ను సొంతం చేసుకున్న తరువాత కొంతకాలం సినిమాలకు దూరమయ్యారు.
బ్రేక్ తీసుకోవడం వల్ల వేణుకు సినిమా ఆఫర్లు తగ్గాయి. ఆ తరువాత వేణు దమ్ము సినిమాలో కీలక పాత్రలో నటించగా ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ కావడంతో వేణుకు పెద్దగా ఆఫర్లు రావడం లేదు. అవకాశాలు రాకపోవడం వల్లే వేణు సినిమాలకు దూరంగా ఉన్నారని తెలుస్తోంది. మంచి మూవీ ఆఫర్ వస్తే సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడానికి వేణు సిద్ధంగా ఉన్నారని సమాచారం. సినిమాలకు దూరమైన తర్వాత వ్యాపారంతో బిజీ అయిన వేణు పూర్తిస్థాయి బిజినెస్ మేన్ గా మారిపోయారు.
గతేడాది లాక్ డౌన్ అమలైన సమయంలో పేదలకు తన వంతు సహాయం చేసి వేణు వార్తల్లో నిలిచారు. 2013 లోక్ సభ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ తరఫున ఆయన బావ కోసం వేణు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో వేణు మళ్లీ మూవీ ఆఫర్లతో బిజీ అవుతారో లేదో చూడాల్సి ఉంది.