2000 వ సంవత్సరం నుండీ ఇద్దరు హీరోలు ప్రేమ కథా చిత్రాలు చేస్తూనే స్టార్ డం ను సొంతం చేసుకున్నారు. వాళ్ళు మరెవరో కాదు ఉదయ్ కిరణ్, తరుణ్. ‘నువ్వే కావాలి’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తూనే ఏకంగా ఇండస్ట్రీ హిట్ ను కొట్టి స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు తరుణ్. మరో పక్క అదే ఏడాది ‘చిత్రం’ మూవీతో ఎంట్రీ ఇస్తూనే ఆ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టి మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయాడు ఉదయ్ కిరణ్. అటు తర్వాత ఇతను నటించిన ‘నువ్వు నేను’ ‘మనసంతా నువ్వే’ చిత్రాలు ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసాయి.
ఉదయ్ కిరణ్ కు స్టార్ ఇమేజ్ ను కట్టబెట్టాయి. వీళ్ళిద్దరి కెరీర్ పీక్స్ లో ఉన్న టైములో వీళ్ళతో ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని చేయాలని ఓ స్టార్ ప్రొడ్యూసర్ ప్లాన్ చేశారట. ఆయన మరెవరో కాదు యం.ఎస్.రాజు గారు. ఉదయ్ కిరణ్ తో ‘మనసంతా నువ్వే’ చిత్రాన్ని నిర్మించి బ్లాక్ బస్టర్ అందుకున్న రాజు గారు అటు తర్వాత ఉదయ్ కిరణ్ తో ‘నీ స్నేహం’ మూవీ కూడా చేశారు. ‘మనసంతా నువ్వే’ బ్లాక్ బస్టర్ కావడంతో ‘నీ స్నేహం’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.2002 వ సంవత్సరం నవంబర్ 1న ‘నీ స్నేహం’ విడుదలయ్యింది. మొదటి రోజు ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ అయితే నమోదయ్యాయి కానీ.. ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది.
దీనికి ప్రధాన కారణం తరుణ్ అని రాజు గారు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ‘నీ స్నేహం’ లో కీలకమైన స్నేహితుడి పాత్రకి ముందుగా తరుణ్ ను అనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల అతను నొ చెప్పడంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయంలేని జతిన్ గ్రేవాల్ తో ఆ పాత్రని చేయించారట. దాంతో ఈ సినిమా అటు లవ్ స్టోరీ కాక ఫ్రెండ్ షిప్ బేస్డ్ మూవీ కాకుండా పోయిందని ప్రేక్షకులు విమర్శించినట్టు నిర్మాత యం.ఎస్.రాజు ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ఒకవేళ తరుణ్ కనుక చేసి ఉంటే ‘నీ స్నేహం’ సూపర్ హిట్ మూవీ అని కూడా ఆయన తెలిపారు.