స్నేహితులిద్దరూ… ఈ సారి హీరోలుగానే వస్తున్నారు… నిర్మించేది ఆ సంస్థే..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అలాగే టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ మంచి స్నేహితులని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిలో గోపీచంద్ 2001 లో ఇండస్ట్రీకి అడుగుపెడితే.. ప్రభాస్… 2002 లో అడుగుపెట్టాడు. అయితే ‘తొలివలపు’ చిత్రం ప్లాప్ అవ్వడంతో పాటు కొన్ని ఆర్ధిక సమస్యల వల్ల గోపీచంద్ విలన్ గా నటించాడు. అయితే తిరిగి హీరోగా చేద్దామనుకున్న తరుణంలో… కేవలం ప్రభాస్ మీద ఉన్న ఇష్టంతోనే గోపీచంద్ ‘వర్షం’ చిత్రంలో విలన్ గా నటించాడట. ఇక ఆ చిత్రం ఎలాంటి విజయాన్ని నమోదుచేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభాస్ చిత్రాల్లో ‘ఆల్ టైం హిట్’ గా నిలిచింది ఆ చిత్రం.

ఇక తరువాత ఎవరి చిత్రాలలో వారు హీరోలుగా నటిస్తూ బిజీ అయిపోయారు. అయితే వీరిద్దరూ కలిసి ఓ మల్టీ స్టారర్ చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నారట. ఈ విషయాన్ని ప్రభాస్ కూడా చాలా సార్లు చెప్పాడు. సరైన కథ కోసం చాలా ఎదురు చూసారు. మొదట్లో ఈ మల్టీ స్టారర్ చిత్రాన్ని డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తాడని గతంలో వార్తలు వచ్చాయి. అయితే తరువాత దీని గురించి ఎటువంటి చప్పుడూ లేదు. తరువాత ప్రభాస్ కూడా ఐదేళ్ళు ‘బాహుబలి’ కి కట్టుబడి ఉండిపోయాడు. అయితే అనూహ్యంగా ఈ మల్టీస్టారర్ గురించి మళ్ళీ ఫిలింనగర్లో డిస్కషన్స్ మొదలయ్యాయి. ప్రభాస్ , ‘యూవీ క్రియేషన్స్’ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘మిర్చి’ ‘సాహూ’ ‘ప్రభాస్ 20’ ఇలా వరుసగా ‘యూవీ క్రియేషన్స్’ వారు ప్రభాస్ తో సినిమాలు చేస్తున్నారు. ఇక గోపీచంద్ కూడా ‘యూవీ క్రియేషన్స్’ లో ‘జిల్’ చిత్రం చేసాడు. ఇప్పుడు ప్రభాస్ – గోపీచంద్ తో కలిసి నటించబోయే చిత్రాన్ని కూడా ‘యూవీ క్రియేషన్స్’ సంస్థే నిర్మించబోతోందట. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన కథ కూడా ఫైనల్ అయిపోయిందని తాజా సమాచారం. ఓ క్రేజీ డైరెక్టర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన పూర్తి వివరాలు బయటకి వస్తాయని ఫిలింనగర్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus