మెగాస్టార్ పై ఎప్పటికీ చెరగనిఅభిమానం…పవన్ కళ్యాణ అంటే ప్రాణం, వెరసి సినిమా ప్రపంచం అంటే ప్యాషన్. ఇది ఒక్క ముక్కలో చెప్పాలి అంటే యువ హీరో నితిన్ సినీ ప్రయాణం. జయం సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టి, తొలి అడుగుతోనే ‘జయ’ కేతనం ఎగరవేసాడు. ఇక వెనువెంటనే వినాయక్ సంధించిన ‘దిల్’ బాణం నితిన్ ను మాస్ హీరోగా ఆవిష్కరించింది…అయితే సినిమా అంటే ప్రాణం అయినప్పటికీ…రెండు భారీ హిట్ తో మంచి ఊపు మీద ఉన్నప్పటికీ ఆ విజయాల పరంపర అపజయాల బాణాలని ఆపలేకపోయింది. ఇక రెండు అపజయాల తరువాత టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఉసిగొల్పిన ‘సై’ సినిమా రికార్డు హిట్ సాధించి నితిన్ ను టాప్ ప్లేస్ లో నిలబెట్టింది. ఇక ఆతరువాత 10కి పైగా అపజయాలు ఒకదాని వెనుక మరొకటి వెంటపడినా, ఎక్కడా చెక్కు చెదరకుండా, ఆత్మ విశ్వాసాన్ని కోల్పోకుండా వరుసగా, బడా నిర్మాతలతో, టాప్ హీరోయిన్స్ తో సినిమాలు చేస్తూనే ఉన్నాడు. కట్ చేస్తే మళ్లీ ‘ఇష్క్’తో టాలీవుడ్ లో హిట్ సాధించి ఆతరువాత వరుసగా హిట్స్ కొట్టుకుంటూ వస్తున్నాడు. ఇక అదే క్రమంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అ…ఆ’ సినిమాతో ప్రేక్షక లోకాన్ని పలకరించనున్న ఈ యువ హీరో కరియర్ లో కొన్ని ఆణిముత్యాలను ఒక లుక్ వేద్దాం రండి.
1.జయం
అప్పటి టాప్ దర్శకుడు తేజ దర్శకత్వంలో అమాయకపు పల్లెటూరి కుర్రాడి పాత్రలో అద్భుతంగా నటించాడు నితిన్. ఈ సినిమా భారీ సాధించడమే కాకుండా నితిన్ కు ఉత్తమ నూతన తెలుగు నటుడుగా దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ ను తెచ్చిపెట్టింది.
2.దిల్
నితిన్ హీరోగా రాజు నిర్మాణంలో, ప్రముఖ దర్శకుడు వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అనేక ప్రభంజనాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారింది. ఈ సినిమాతో నితిన్ మాస్ హీరోగా మంచి మార్క్స్ కొట్టెయ్యగా. ఇక వినాయక్ కు సైతం మంచి కమర్షియల్ హిట్ ను తెచ్చిపెట్టింది. అదే క్రమంలో నిర్మాత రాజుని దిల్ రాజుగా మార్చడమే కాకుండా, ఈ సినిమా దాదాపు 91 కేంద్రాలలో 50 రోజులకు పైగా పూర్తి చేసుకుని అప్పట్లో భారీ హిట్ గా నిలిచింది.
3.శ్రీఆంజనేయం
భక్తితో కూడిన కధతో, కృష్ణ వంశీ తెరకెక్కించిన ‘శ్రీ అంజయనేయం చిత్రంలో అమాయకపు ఆంజనేయుని భక్తునిగా నటించి అందరినీ మెప్పించాడు.
4.సై
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో రఫ్ స్టూడెంట్ గా, రగ్బీ మ్యాచ్ ప్లేయర్ గా మంచి నటనను కనబరచడమే కాకుండా, మరో సారి బారి హిట్ సాధించాడు.
5.అల్లరిబుల్లోడు
తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన సినిమా, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా.
6.అగ్యాత్
2009లో విడుదలయిన ఈ సినిమాను రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాతో నితిన్ బాలీవుడ్ లో అడుగు పెట్టాడు.
7.ఇష్క్
అనేక పరాజయాలు పలకరించినా, భయపడకుండా వెనకడుగు వెయ్యకుండా సంకల్పంతో దూసుకెళ్లిన క్రమంలో సాధించిన భారీ హిట్.
8.గుండెజారిగల్లంతయ్యిందే
శ్రేష్ఠ్ మూవీస్ పతాకంతో నితిక రెడ్డి నిర్మాణంలో విక్రం గౌడ్ సమర్పణలో, కొండా విజయ్ కుమార్ కథ మరియు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, నితిన్-నిత్యా మీనన్ కాంబినేషన్ ను హిట్ కాంబినేషన్ గా నిలిపింది. ఇక ఈ సినిమాలో ప్రముఖ బ్యాట్మింటన్ క్రీడాకారిణి ‘గుత్తా జ్వాల’ ఒక ఐటమ్ సాంగ్ లో నటించడం విశేషం.
9.చిన్నదాన నీకోసం – అఖిల్
ఈ రెండు సినిమాల్లో మొదటిది చిన్నదాన నీకోసం చిత్రానికి హీరోగానే కాకుండా సహా నిర్మాతగా కూడా వ్యవహరించాడు. ఇక అఖిల్ సినిమాను తానే స్వయంగా నిర్మించాడు.
10.’అ…ఆ’
ప్రముఖ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో టాలీవుడ్ రికార్డులను షేక్ చేసేందుకు సిద్దం అవుతున్నది ఈ చిత్రం.
అలా అపజయాలను వెనక్కి నెట్టుకుంటూ…విజయాల తలుపులు ఒక్కొక్కటి తెరుచుకుంటూ సినీ ప్రపంచంలో దూసుకుపోతున్నాడు మన యువ హీరో నితిన్.