సునీల్ గోల్డ్ ఎహే

వెండి తెరపై సునీల్ ని చూసినప్పుడే తెలుగు ప్రజలు నువ్వేకావాలి అన్నారు. అతని టైమింగ్ కి పడి పడి నవ్వి నువ్వు నాకు నచ్చావ్ అని చెప్పేసారు. సునీల్ లోని ఓ మంచి పనోడుని గమనించి నిర్మాతలు, దర్శకులు నువ్వులేక మా సినిమాలు లేవు అన్నారు. ఇలా ఈ భీమవరం బుల్లోడు 160 సినిమాల్లో కితకితలు పెట్టాడు. పదేళ్ల సేవలను మెచ్చిన అభిమానులు సునీల్ కి హాస్య నటుడి నుంచి హీరోగా ప్రమోషన్ ఇచ్చారు. కష్టపడి కథానాయకుడిగా కూడా మెప్పించాడు. అందుకే అతన్ని ఇప్పుడూ అందరూ నువ్వు గోల్డ్ ఎహె అంటున్నారు.

గోదావరి యాస.. వెకిలి నవ్వు.. అమాయకమైన మొహం.. ఇవే సునీల్ కి బలం. బ్రహ్మనందం, ఎం.ఎస్. నారాయణ, ఏవీఎస్, ధర్మవరపు లాంటి వారు అప్పటికే మంచి ఫామ్ లో ఉన్నారు. ఆ టైం లో కుర్ర హాస్య నటుడిగా ఎంట్రీ ఇచ్చి తన ఆ టైమింగ్ తో బిజీ అయి పోయారు.

కొత్త పేర్లకు ప్రాణం ..


తెలుగు పరిశ్రమలోని రచయితలు సునీల్ కోసం కొత్తగా పేర్లను సృష్టించారు. ఆ పేర్లకు సునీల్ తన నటనతో ప్రాణం పోశారు. నువ్వు నాకు నచ్చావ్ లో బంతి పేరుతో నవ్వించారు. కర్రీ శీను , బంకు శీను అంటూ కితకితలు పెట్టించారు. నేనున్నాను లో టిప్ సుందర్ , ఖుషి ఖుషీగా లో సర్వర్ ప్రకాష్ ఆనందాన్ని సర్వ్ చేశారు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా లో “బండ”గా, చుక్కల్లో చంద్రుడిలో “పప్పీ”గా, ఠాగూర్ లో బూస్ట్ గా సినిమాలకు బూస్ట్ అయ్యారు.

అందాల రాముడు


హాస్య నటుడిగా సినిమాల్లో బిజీగా ఉన్నపుడే సునీల్ “అందాల రాముడు”లో లీడ్ రోల్ పోషించారు. అప్పటి టాప్ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ తో కలిసి డ్యాన్స్ లు చేశారు. భారీ శరీరం ఉన్నా అవలీలగా డాన్స్ చేసి అదర గొట్టారు. పెద్ద దర్శకుల దృష్టిలో పడ్డారు.

మర్యాద రామన్న


హీరోగా ఒక్క సినిమాతోనే సునీల్ అపజయం ఎరుగని దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళితో పనిచేసే అవకాశం దక్కించుకున్నారు. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారారు. సునీల్ హీరో మెటీరియల్ కాడు అన్న వారందరికీ “మర్యాద రామన్న” తో సమాధానం చెప్పారు. తన సినీ ప్రయాణంలో ఈ చిత్రం ఒక మైలు రాయిగా నిలిచింది.

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పలరాజు


సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినీ రంగం లోని లొసుగులను ఎత్తి చూపేందుకు సునీల్ ని హీరోగా ఎంచుకున్నాడు. హీరోగా కెరీర్ మొదలు పెట్టినప్పుడే ప్రముఖ దర్శకులతో పని చేసే అవకాశం దక్కించుకోవడం చూసి సునీల్ కి ఎక్కడో సుడి ఉంది అని చాలామంది అనుకున్నారు. ఎంత శ్రమ, ఒత్తిడి ఉందో సునీల్ కి మాత్రమే తెలుసు. ఈ సినిమాలోనూ అద్భుతమైన నటన ప్రదర్శించి శెభాష్ అనిపించుకున్నారు.

పూల రంగడు


సునీల్ ని హీరోగా నిలబెట్టిన సినిమా పూల రంగడు. ఇందులో నటనతో పాటు యాక్షన్ సీన్ల లోనూ మెప్పించారు. క్లైమాక్స్ లో సిక్స్ ప్యాక్ లో కనిపించి ఔరా అనిపించారు. ఫ్యామిలీ ప్యాక్ బాడీని సిక్స్ ప్యాక్ గా చేసి కమర్షియల్ హీరో స్థాయికి ఎదిగారు. దీంతో హీరోగా అవకాశాలు వెల్లువెత్తాయి.

జక్కన్న


హీరోగా సునీల్ చేసిన Mr. పెళ్ళికొడుకు, భీమవరం బుల్లోడు, కృష్ణాష్టమి సినిమాలు ఆశించినంత విజయం అందుకోలేదు. సునీల్ నటనలో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందని చెబుతున్నా.. కలక్షన్లు పెరగడం లేదు. దాంతో బాగా ఆలోచించి మంచి స్క్రిప్ట్ కి ఒకే చెప్పారు. ద‌ర్శ‌కుడు వంశీ కృష్ణ అకెళ్ళ తో “జక్కన్న” సినిమా చేసారు. వచ్చే నెల విడుదల కానున్న ఈ చిత్రం టీజర్ యూ ట్యూబ్ లో నెటిజనులు విపరీతంగా ఆకట్టుకుంది. చూసిన వారంతా “జక్కన్న” తో సునీల్ మరో హిట్ అందుకోనున్నట్లు చెబుతున్నారు. ఫిల్మ్ ఫోకస్ కూడా సునీల్ కి ఆల్ ది బెస్ట్ చెబుతోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus